మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల అగ్ని ప్రమాదం జరగడం రాజకీయ రంగు పులుముకుంది. రెవెన్యూ రికార్డుల్ని దగ్ధం చేసి, అక్రమాలు వెలుగులోకి రాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించారనే ఆరోపణలు టీడీపీ వైపు నుంచి వెల్లువెత్తాయి. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులంటూ ప్రతిరోజూ సీరియల్‌ను తలపించేలా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. మదనపల్లె కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
ఈ నేపథ్యంలో తనపై టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రభుత్వ తీరును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడుతూ తనపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శలు చేశారు. గతంలో తాము ఇలా చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. తనపై ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేసినా ఇబ్బంది లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగా పని చేశారని ఆయన అన్నారు. మదనపల్లెలో రికార్డులు తగలబడితే తనపై నిందలు వేయడం సరైంది కాదన్నారు.
టీడీపీ కార్యకర్తలతో తమపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అక్రమాలకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే చూపాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసే అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు చంద్రబాబు తెరలేపారని ఆయన అన్నారు. కేసులు ఎదుర్కోడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
The post కావాలనే తప్పుడు రాతలు.. ఏ దర్యాప్తుకైనా సిద్ధం! appeared first on Great Andhra.