దిశ, ఫీచర్స్ : సాధారణంగా కుక్కల్ని పెంచుకోవడమంటే కొంత మందికి ఇష్టం. మరికొందరు వాటికి దూరంగా ఉంటారు. ఇంకొందరు కుక్కల్ని చూస్తేనే అవి కరుస్తాయని భయ పడుతుంటారు. ఎందుకంటే కుక్కలు చిన్నారులను కరిచి ప్రాణాలు తీసిన ఘటనలు కూడా గతంలో చాలానే జరిగాయి. ఇప్పటికీ మనుషులపై కుక్కలు దాడి చేసిన వార్తలు తరచూ ఏదో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అయితే కుక్కలన్నీ ప్రమాదకరం కావని, పిచ్చి కుక్కలు మాత్రమే ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. సాధారణ కుక్కకు, పిచ్చి కుక్కకు తేడా తెలిస్తే కాస్త జాగ్రత్త పడవచ్చు అంటున్నారు.
వీధి కుక్కలతో జాగ్రత్త
వీధి కుక్కలే పిచ్చి కుక్కలుగా మారుతాయని, ప్రాణాలు తీస్తాయని చాలామంది అనుకుంటుంటారు. కానీ ప్రతీ వీధి కుక్క అలాగే ఉండదు. అట్లని ప్రతీ పెంపుడు కుక్క మంచిదని, కరవదని కూడా అనుకోవడానికి లేదు. పరిస్థితిని బట్టి ఏ కుక్క అయినా పిచ్చి కుక్కగా మారవచ్చు. కాబట్టి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని, కరిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే రేబిస్ వ్యాధి బారిన పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
పిచ్చిగా ఎందుకు మారుతాయి?
సాధారణంగా రేబిస్ వైరస్ సోకడంవల్లే ఒక మంచి కుక్క పిచ్చి కుక్కగా మారుతుంది. అయితే వీధి కుక్కలే ఎక్కువగా పిచ్చి కుక్కలుగా మారడానికి కారణం ఏంటంటే.. అవి ఎక్కువగా బయట తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా కుళ్లిపోయిన జంతు మాంసం కనిపిస్తే తింటాయి. ఈ కుళ్లిన మాంసంలో రేబిస్ వైరస్ ఉంటుంది కాబట్టి అది కుక్కలకు సోకుతుంది. దీంతో మంచి కుక్కలు కూడా పిచ్చి కుక్కలుగా మారుతాయి.
ఎలా గుర్తించాలి?
సాధారణ కుక్కకు, పిచ్చి కుక్కకు మధ్య కొన్ని తేడాలు ఉంటాయి. పిచ్చి పట్టిన కుక్క ఎప్పుడూ బద్ధకంగా ఉంటుంది. దాని నోటిలో నుంచి లాలాజలం, నురగ వస్తుంటాయి. పైగా అది మనుషులను చూడగానే ఆవేశంగా అరుస్తూ పైకొస్తుంది. ఇది రోజుకు వంద మందిని కరువగలదట. ఈ లక్షణాలు కనిపిస్తే గనుక పిచ్చి కుక్కగా గుర్తించి జాగ్రత్త పడాలి. అంతేకాకుండా పిచ్చి పట్టిన కుక్క ఆహారం తినదని, ఒకటి రెండు వారాల్లో అది చనిపోతుందని పశు వైద్య నిపుణులు చెప్తున్నారు.