కేంద్ర మాజీ మంత్రికి కాంగ్రెస్ లిఫ్ట్ ఇస్తుందా? Great Andhra


శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి డాక్టర్ వైఎస్సార్ డిస్కవరీగా చెబుతారు. డాక్టర్ గా ఉన్న ఆమెని రాజకీయాల్లో పరిచయం చేసిన వైఎస్సార్ అని అంటారు. 2004లో ఆమెకు శ్రీకాకుళం లోక్ సభ టికెట్ ని ఇచ్చి వైఎస్సార్ ప్రోత్సహించారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎర్రన్నాయుడు పోటీ చేస్తే ఆయనతో కిల్లి కృపారాణి తలపడ్డారు. తొలిసారి ఓటమి పాలు అయినా 2009లో ఎర్రన్నాయుడిని ఓడించి కిల్లి కృపారాణి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. అలా యూపీయే టూ లో ఆమె టెలికమ్యునికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

కాంగ్రెస్ ఏపీలో విచ్చిన్నం కావడంతో 2019లో వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో ఆమెకు ఏ పదవీ దక్కలేదు. దాంతో ఆమె 2024 ఎన్నికల ముందు టెక్కలి నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి అనుకూలంగా గాలి మారుతూండడంతో కిల్లి కాంగ్రెస్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆమె తాజాగా ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని కలిశారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

ఉత్తరాంధ్రలో బీసీ వర్గాలకు చెందిన ఉన్నత విద్యావంతురాలు అయిన కిల్లికి కాంగ్రెస్ లో లిఫ్ట్ ఉంటుందని అంటున్నారు. ఆమె కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో కాంగ్రెస్ ఏపీ విభాగంలో ఆమెకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాన్స్ ఇస్తారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీని అభివృద్ధి చేసే క్రమంలో ఆమె సేవలను ఉపయోగించుకుంటారు అని అంటున్నారు.

కాంగ్రెస్ పాత కాపులు కూడా రానున్న రోజులలో కాంగ్రెస్ వైపు వచ్చేలా చేయాలన్నది హై కమాండ్ ఆలోచన. అందుకే వచ్చిన వారిని సమాదరించేందుకు కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు అని అంటున్నారు. వైసీపీలో పదవి రాలేదని దిగులు పడిన కిల్లి మళ్లీ మాతృ సంస్థలో తన రాజకీయ జాతకాన్ని పరీక్షించుకుంటున్నారు.



Source link

Leave a Comment