మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు కొండా సురేఖ కంటి ద‌గ్గ‌ర గాయాల‌య్యాయి. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ బైక్ ర్యాలీలో అప‌శృతి జ‌రిగింది. ర్యాలీలో భాగంగా స్కూటీ న‌డుపుతున్న సురేఖ కింద‌ప‌డ్డారు. దీంతో ఆమెకు స్వ‌ల్ప గాయాలయ్యాయి. ఉమ్మ‌డి వరంగ‌ల్ జిల్లాలోని భూపాల‌ప‌ల్లిలో రాహుల్‌గాంధీ నేతృత్వంలో బ‌స్సు యాత్ర చేప‌ట్టారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయ‌కులు బైక్ ర్యాలీ చేప‌ట్టారు. భారీ సంఖ్య‌లో కాంగ్రెస్ శ్రేణులు ద్విచ‌క్ర వాహనాల్లో ర్యాలీగా బ‌య‌ల్దేరారు. కొండా సురేఖ స్వ‌యంగా స్కూటీ న‌డుపుతూ ప్ర‌మాదానికి గుర‌య్యారు. కింద‌ప‌డ‌డంతో ఆమె చేతులు, కాళ్ల‌తో పాటు కంటి ప‌క్క‌న‌, పైభాగాన గాయాల‌య్యాయి. వెంట‌నే ఆమెను కాంగ్రెస్ శ్రేణులు వ‌రంగ‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించాయి.
బైక్ ర్యాలీలో ఇద్ద‌రు యువ‌కుడు సెల్ఫీ దిగాల‌నే క్ర‌మంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు సురేఖ తెలిపారు. ప్ర‌మాదానికి గురైన తాను కొంత స‌మ‌యం అపస్మార‌క స్థితిలోకి వెళ్లిన‌ట్టు ఆమె తెలిపారు. త‌న త‌ల‌కు గాయాలు కాక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌న్నారు. ఇదిలా వుండ‌గా ఆస్ప‌త్రిలో సురేఖ‌ను చూసి ఆమె భ‌ర్త కొండా ముర‌ళి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. ఆయ‌న్ను కాంగ్రెస్ నాయ‌కులు ఓదార్చారు.
గాయాల‌పాలైన సురేఖ‌ను టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, ఇత‌ర కాంగ్రెస్ నాయ‌కులు ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు. ఆమె యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. త్వ‌ర‌గా కోలుకుని ఎన్నిక‌ల యుద్ధంలో పాల్గొనాల‌ని వారు ఆకాంక్షించారు. గ‌తంలో ప‌ర‌కాల నుంచి సురేఖ గెలుపొందారు. ఇప్పుడామె వ‌రంగ‌ల్‌కు మ‌కాం మార్చిన సంగ‌తి తెలిసిందే.
కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంత‌రం రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణకు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతో ఆ పార్టీని సురేఖ దంప‌తులు వీడారు. అనంత‌రం బీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌తో పొస‌గ‌క‌పోవ‌డంతో ఆ పార్టీని వీడారు. మ‌ళ్లీ కాంగ్రెస్ పంచ‌న చేరారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున ఆమె బ‌రిలో నిల‌వ‌నున్నారు.