దర్శకుడు కొరటాల శివకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ వంటి వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాలకు కొంతకాలంగా టైం కలిసి రావడంలేదు. ఆయన గత చిత్రం ‘ఆచార్య’ ఘోర పరాజయంపాలైంది. ఆ సినిమా ఫైనాన్షియల్ విషయాలను కొరటాల చూసుకోవడంతో విడుదల తర్వాత ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ ప్రభావం ఆయన కొత్త సినిమా ‘దేవర’పై పడటంతో ఆలస్యంగా పట్టాలెక్కింది. ఆలస్యంగా మొదలైనప్పటికీ పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుగుతుందని, ముందుగా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 5న సినిమా విడుదలవుతుందని భావించారంతా. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ మరియు కొన్ని ఇతర కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చాలదు అన్నట్టుగా ‘శ్రీమంతుడు’ కథ వివాదం విషయంలో తాజాగా కొరటాల శివకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
మహేష్ బాబు హీరోగా కొరటాల దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ చిత్రం 2015 లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా కథను.. స్వాతి పత్రికలో ప్రచురించిన కథ నుంచి కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. శరత్ చంద్ర పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. దర్శకుడు కొరటాల శివ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. కథను కాపీ కొట్టారు అనేందుకు ఉన్న ఆధారాలను రచయిత శరత్ చంద్ర కోర్టుకి సమర్పించడంతో పాటు.. ఆయన సమర్పించిన ఆధారాలను నిర్ధారిస్తూ రచయిత సంఘం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్ధించింది. దీంతో కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే సుప్రీంకోర్టులో కూడా కొరటాలకు షాక్ తగిలింది.
కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ధర్మాసనం విచారణ జరిపింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని.. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల శివ తరపున సీనియర్ న్యాయవాది, ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఆ వాదనలను సుప్రీమ్ తోసిపుచ్చింది. రచయిత సంఘం నివేదిక ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని, స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.