దిశ, ఫీచర్స్ : టీనేజ్ ఎంతో మధురమైందని కొందరు చెప్తుంటారు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆనందంగా ఉండగలిగే ఛాన్స్ ఈ వయస్సులోనే ఎక్కువని అంటుంటారు. కానీ మారుతున్న జీవనశైలి, ఎన్విరాన్‌మెంటల్ ఎఫెక్ట్ వల్ల ప్రస్తుతం అటువంటి పరిస్థితి కాస్త సడలుతోందని నిపుణులు చెప్తున్నారు. రకరకాల ఒత్తిళ్లు పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే కౌమార దశలో నిరంతరం స్ట్రెస్‌ను ఎదుర్కొనే పిల్లలు యుక్తవయస్సులోకి వచ్చినప్పుడు మానసిక అనారోగ్యంతో బాధపడే ప్రమాదం ఉంటోందని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఇటీవలి అధ్యయనాలు కూడా అదే పేర్కొంటున్నాయి.
బిహేవియరల్ ఇష్యూస్
అడాలోసెంట్ లేదా కౌమార దశలో ఉన్నప్పుడు అధిక ఒత్తిడికి గురవడంవల్ల అది క్రమంగా మెదడులోని జన్యు వ్యక్తీకరణలో మార్పులకు దారితీస్తుందని, దీనివల్ల పెద్దయ్యాక కూడా బిహేవియరల్ ఇష్యూస్, వివిధ మానసిక రుగ్మతలు యుక్త వయస్కులను వెంటాడే అవకాశం ఉందని బ్రెజిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో యొక్క రిబీరో ప్రిటో మెడికల్ స్కూల్ పరిశోధకులు చెప్తున్నారు. ఈ మార్పులు ముఖ్యంగా బయోఎనర్జీకి సంబంధించిన జన్యువులలో, కణ శ్వాసక్రియను ప్రభావితం చేయవచ్చు. అడోలోసెన్స్ అనేది శారీరక, మానసిక మార్పులకు ముఖ్యమైన దశగా ఉంటుంది. ప్రధానంగా మెదడులోని ఫంక్షనల్ ఇంటరాక్షన్ స్ట్రక్చరల్ మార్పులకు లోనవుతుంది.
వ్యక్తిత్వానికి కీలక దశ
తరచుగా మానసిక ఆందోళన, అవమానాలను ఎదర్కోవడం, ఇతరుల ద్వారా దాడికి గురికావడం వంటివి కౌమార దశలో ఉన్న పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా సామాజిక ప్రతికూలతలు, పర్యావరణ కారకాలు కూడా వారిలో నెగెటివ్ ఫీలింగ్స్‌ను ప్రేరేపిస్తాయి. భిన్నమైన భావాలకు, వ్యక్తిత్వానికి దోహదం చేస్తాయని నిపుణులు చెప్తుంటారు. అందుకే ఈ దశలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వారి వ్యక్తిత్వం రూపుదిద్దుకునే ముఖ్యమైన దశగా ఉంటుంది.
జన్యువుల్లో మార్పులు
ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి బ్రెజిల్‌కు చెందిన న్యూరోసైన్స్ ప్రొఫెసర్ కార్మెన్ శాండి తన బృందంతో కలిసి బిహేవియరల్ జెనెటిక్స్ లాబొరేటరీలో ఎలుకలు, అలాగే మానవుల ఆర్ఎన్ఏ నమూనాలను అబ్జర్వ్ చేశారు. బయో ఇన్ఫర్మేటిక్స్ టూల్స్‌ను ఉపయోగించి మెసెంజర్ ఆర్‌ఎన్‌ఎను క్రమం చేసి ఎనలైజ్ చేశారు. అయితే ఒత్తిడి ప్రి ఫ్రంటల్ కార్టెక్స్ యొక్క జన్యువులలో మార్పులకు దారితీసిందని వారు గమనించారు. దీంతో కౌమార దశలో ఒత్తిడి కూడా యుక్త వయస్సులో ఎలా ఇబ్బందికరంగా మారుతుందో అంచనా వేశారు. ఇక ఒత్తిడికి గురైన జంతువుల మెదడులో మైటోకాండ్రియా ద్వారా ఆక్సిజన్ వినియోగం బలహీనంగా ఉంటుందని కూడా పరిశోధకులు చెప్తున్నారు.
వ్యక్తిత్వంపై ప్రభావం
కౌమార దశలో తరచూ మానసిక ఒత్తిడి, అవమానాలు ఎదుర్కొనే వారు యుక్త వయస్సులో వివిధ మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఎక్కువని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు పాఠశాల స్థాయిలో తరచూ స్నేహితులు, ఉపాధ్యాయుల నుంచి అవమానాలు ఎదుర్కొనే వారు యుక్త వయస్సులో తాము కూడా ఇతరులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరింవచ్చు. కుటుంబ సభ్యులను లెక్క చేయకపోవచ్చు. నిర్ధయగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఇతరుల బాధలను పెద్దగా పట్టించుకోని వ్యక్తులుగా మారుతారు. ప్రతి విషయంలో ఇతరులను అనుమానించడం, వేధించడం వంటి ప్రవర్తన కూడా కౌమార దశలో ఒత్తిడిని ఎదుర్కొన్నవారిలో పెద్దయ్యాక కనిపించే అవకాశాలు ఉంటాయి. అయితే అందరిలోనూ ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. కొన్ని సామాజిక పరిస్థితులు, అధ్యయనం, సోషల్ ఇంటరాక్షన్స్ మంచి ప్రవర్తన వైపు కూడా ప్రేరేపించే చాన్స్ ఉంటుంది.