posted on Dec 31, 2024 9:30AM
నిమ్మరసం భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం. నిమ్మరసాన్ని వంటల్లో మాత్రమే కాకుండా రిఫ్రెషింగ్ డ్రింక్స్ లోనూ, డిటాక్స్ డ్రింక్స్ లోనూ ఉపయోగిస్తారు. నిమ్మరసాన్ని భారతీయ సంప్రదాయ వంటల తయారీలోనూ ఉపయోగిస్తారు. నిమ్మరసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా నిమ్మరసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.
నిమ్మరసం సిట్రస్ జాతికి చెందిన పండు. దీన్ని పండు అని పిలుస్తామే కానీ నేరుగా దీన్ని తినలేము. చాలా పుల్లగా ఉండే నిమ్మరసాన్ని పానీయాలలోనూ, వంటల్లోనూ పులుపు కోసం జోడించుకుంటారు. ఇక నిమ్మకాయలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మలబద్దకం, అజీర్ణం సమస్యలను కూడా తొలగిస్తుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే పేగులు శుభ్రపడతాయి. శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోతాయి.
ప్రతి ఒక్కరి శరీరంలో టాక్సిన్లు ఉంటాయి. ఇవి ఆహారం, తాగే పానీయాలు, నీరు, వాతావరణం కారణంగా శరీరంలో చేరతాయి. ఈ టాక్నిన్లను తొలగించుకోవాలంటే డిటాక్స్ వాటర్ తాగాలి. డిటాక్స్ వాటర్ తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది. అందుకోసం ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో విష పదార్థాలు, వ్యర్థాలు అనబడే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.
నిమ్మకాయలో విటమిన్-సి ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజూ నిమ్మరసం కలిపిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటే రోగనిరోధక శక్తి బలపడి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది.
ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉండేలా చేస్తుంది. నిమ్మరసంలో ఉండే సమ్మేళనాలు శరీరానికి చురుకుదనం ఇస్తాయి.
నిమ్మరసంలో ఉండే విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు.. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఉండే అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గాలని అనుకునేవారికి చాలా మంచి పానీయం. నిమ్మరసం కలిపిన నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులలోనే బరువు విషయంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.
నిమ్మకాయలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది. ఎలాగంటే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తపోటు ఎక్కువైన సందర్బాలలోనే గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నిమ్మరసాన్ని అధిక రక్తపోటు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
మధుమేహం ఉన్నవారికి కూడా నిమ్మరసం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీటిని తాగుతుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
*రూపశ్రీ.