గిరిజన మహిళను దళిత మహిళైన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కించపరిచేలా కామెంట్స్, ఎవరైనా ఏం మాట్లాడ్తారు? రాజకీయంగా ఎన్ని అభిప్రాయ భేదాలైనా వుండొచ్చు. వాటిని గౌరవిస్తూనే, విధానాలపరంగా చర్చించుకోవాలి. ఇందులో భాగంగా పరస్పరం విమర్శలు చేసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు.
కానీ శాసనమండలిలో హోంశాఖ మంత్రి అనిత ఇటీవల వివాదాస్పదమైన గిరిజన మహిళ, దేవాదాయశాఖ ఉద్యోగిని అవమానించేలా నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంపై నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. దళిత మహిళగా, అలాగే భర్తతో దూరమై అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్న రాజకీయ నాయకురాలిగా అనిత మరో గిరిజన మహిళను ఉద్దేశించి చట్టసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని అభ్యంతరక కామెంట్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“పాపం విజయసాయిరెడ్డికి మనశ్శాంతి లేదు. శాంతిభద్రత లేకుండా అయిపోయింది అధ్యక్షా మొన్నటి వరకు. అది వేరే విషయం” అని అనిత కామెంట్స్ చేశారు. అనిత కామెంట్స్‌పై మండలి చైర్మన్ మోషేన్‌రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని విజయసాయిరెడ్డి గురించి మాట్లాడ్డం మంచిది కాదన్నారు.
అనిత మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. ప్రశ్న వచ్చిందని, న్యాయం చేయాలని అతను (గిరిజన మహిళ మొదటి భర్త) తనకు వచ్చినట్టు అనిత చెప్పుకొచ్చారు. మనశ్శాంతి, శాంతి అంటూ అనిత మాట్లాడ్డం ఆమె విజ్ఞతకే వదిలేయాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక మహిళా హోంమంత్రే సాటి గిరిజన మహిళ గురించి అవహేళనగా మాట్లాడ్డం చూస్తే, ఏపీ సమాజం ఎటు వైపు వెళుతోందనే ఆందోళన కలుగుతోందని నెటిజన్లు వాపోవడం గమనార్హం.