EntertainmentLatest News

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ


సినిమా పేరు: గీతాంజలి మళ్ళీ వచ్చింది

తారాగణం: అంజలి, శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌, సత్య, సునీల్, ఆలీ, రవి శంకర్, రాహుల్ మాధవ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫీ:  ఛోటా కె. ప్రసాద్

కథ: కోన వెంకట్

దర్శకత్వం: శివ తుర్లపాటి

నిర్మాత:  ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్

బ్యానర్: ఎంవీవీ సినిమాస్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌

విడుదల తేదీ: ఏప్రిల్ 11, 2024

ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. అంజలి ప్రధాన పాత్ర పోషించిన హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’ 2014 లో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్లకు ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ఇప్పుడు థియేటర్లలో అడుగుపెట్టింది. ఇది అంజలికి 50వ చిత్రం కావడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? ‘గీతాంజలి’ మాదిరిగానే మెప్పించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

‘గీతాంజలి’ తర్వాత వరుస పరాజయాలు ఎదురుకావడంతో సినిమా అవకాశాలు లేక కష్టాలు అనుభవిస్తుంటాడు దర్శకుడు శ్రీను(శ్రీనివాస్‌ రెడ్డి). రచయితలు ఆత్రేయ(సత్యం రాజేష్), ఆరుద్ర(షకలక శంకర్)తో కలిసి చిన్న పెంట్ హౌస్ లో రెంట్ కి ఉంటాడు. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడటం కోసం స్నేహితుడు అయాన్(సత్య)కి హీరోని చేస్తామని మాయమాటలు చెప్పి, డబ్బులు గుంజుతూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో సినిమా రంగం వదిలేసి వెళ్లిపోదామనుకున్న సమయంలో.. బిజినెస్ మ్యాన్ విష్ణు(రాహుల్ మాధవ్) పిలిచి మరీ సినిమా ఛాన్స్ ఇస్తాడు. అంతేకాదు, తనే ఒక హారర్ కథ రాసి ఇవ్వడమే కాకుండా.. హీరోయిన్ గా అంజలిని తీసుకోవాలని, షూటింగ్ సంగీత్ మహల్ లోనే చేయాలని షరతులు పెడతాడు. అసలు విష్ణు ఎవరు? అతని గతమేంటి? శ్రీను, అంజలి వాళ్ళకి పిలిచి మరీ సినిమా అవకాశం ఎందుకు ఇచ్చాడు? సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేయమని షరతు పెట్టడానికి కారణమేంటి? ఆ మహల్ లో ఏముంది? తన చెల్లి అంజలి కోసం గీతాంజలి మళ్ళీ ఎందుకు వచ్చింది? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

ఒక హిట్ సినిమాకి సీక్వెల్ తీయడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే సీక్వెల్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాల కారణంగా మొదటి సినిమాని మించేలా సీక్వెల్ తీయాలనే ఒత్తిడి చిత్ర బృందం మీద పడుతుంది. అయితే ఆ ఒత్తిడిని జయించి, ప్రేక్షకులను మెప్పించడంలో గీతాంజలి టీం బాగానే సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

ఈ సినిమా ఓ హారర్ సీన్ తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శ్రీనివాస్‌ రెడ్డితో పాటు ఇతర పాత్రల పరిచయాలు, సినిమా అవకాశం రావడంతో అందరూ ఊటీ వెళ్లడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. అయితే ఫస్టాఫ్ లో పెద్దగా మెరుపులు లేనప్పటికీ.. సత్య, అలీ పాత్రలతో కామెడీ పంచి, ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ఇంటర్వెల్ సీన్ మెప్పించింది. ఇక సెకండాఫ్ అయితే థియేటర్లలో నవ్వులు పూయించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్ లో సత్య, సునీల్ పోటాపోటీగా నవ్వించారు.

సాధారణంగా హారర్ సినిమాల్లో అప్పటి వరకు భయపెట్టి, చివరిలో దెయ్యాల ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తుంటారు. కానీ ఇందులో అలా కాదు. ఫస్టాఫ్ లోనే ఆడియన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. విష్ణు(రాహుల్ మాధవ్) ఎవరు?, సంగీత్ మహల్ కథ ఏంటి? అనేవి ఫస్టాఫ్ లోనే రివీల్ చేయడంతో.. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పేరుతో స్పీడ్ బ్రేకర్ వేసే అవసరం లేకుండా పోయింది. దీంతో పతాక సన్నివేశాల వరకు సెకండాఫ్ లో నాన్ స్టాప్ గా నవ్వించే స్కోప్ దొరికింది. ఆ నవ్వుల కారణంగానే ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మెరుగ్గా ఉందనిపిస్తుంది. అలాగే థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు, కాసేపు హాయిగా నవ్వుకున్నామనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగేలా చేస్తుంది.

అయితే ఇది పేరుకి హారర్ కామెడీ సినిమా అయినప్పటికి, హారర్ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవు. ప్రధానంగా కామెడీని నమ్ముకొని తీసిన సినిమా ఇది. ఫస్టాఫ్ ని ఇంకా బాగా రాసుకొని, సెకండాఫ్ హారర్ డోస్ పెంచినట్లయితే.. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.

కోన వెంకట్ రాసిన కథలో కొత్తదనం లేనప్పటికీ, ‘గీతాంజలి’ కథతో ముడిపెడుతూ సీక్వెల్ కథ రాసుకున్న తీరు మెప్పించింది. దర్శకుడిగా శివ తుర్లపాటి పనితనం బాగానే ఉంది. కామెడీ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది. ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచిన పాటలు తేలిపోయాయి. నేపథ్య సంగీతం బాగానే ఉంది. ఛోటా కె. ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది. 

నటీనటుల పనితీరు:

అంజలి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో మెప్పించింది. శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌ ల త్రయం మరోసారి తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. హీరో కావాలని కలలు కనే అయాన్ పాత్రలో నటించిన సత్య.. ఈ సినిమాకి నిజంగానే హీరో అని చెప్పవచ్చు. అంతలా తన కామెడీతో సినిమాని నిలబెట్టాడు. ఇక కిల్లర్ నాని అనే కెమెరామ్యాన్ పాత్రలో సునీల్ కూడా గట్టిగానే నవ్వులు పంచాడు. అలీ కూడా తన మార్క్ కామెడీతో బాగానే నవ్వించాడు. ఇక శాస్త్రి అనే పాత్రలో రవి శంకర్ సర్ ప్రైజ్ చేశాడు. రాహుల్ మాధవ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా..

ఇది పేరుకి హారర్ కామెడీ సినిమా అయినప్పటికీ.. భయపెట్టే సన్నివేశాలు పెద్దగా లేవు గానీ, నవ్వించే సన్నివేశాలు మాత్రం బోలెడున్నాయి. కాసేపు హాయిగా నవ్వుకోవడం కోసం ఈ సినిమా హ్యాపీగా చూసేయొచ్చు.

రేటింగ్: 2.75/5 



Source link

Related posts

Todays Top 10 Headlines 10 October Andhra Pradesh Telangana Politics Latest News Today From Abp Desam | Top Headlines Today: ఆరు నెలలు లీడర్లకు ప్రోగ్రామ్స్‌ ఫిక్స్ చేసిన జగన్

Oknews

Governor Tamili Sai on Women's Reservation Bill| మహిళారిజర్వేషన్ బిల్లుపై గవర్నర్ తమిళిసై రియాక్షన్

Oknews

ఆర్ నారాయణమూర్తి ఉన్న హాస్పిటల్ కి కేటిఆర్ ఫోన్   

Oknews

Leave a Comment