దిశ, ఫీచర్స్ : మోడర్న్ డేస్ బిజీ షెడ్యూల్ కారణంగా ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. లైఫ్‌లో స్ట్రెస్ కామనే అయినప్పటికీ, అది దీర్ఘకాలికంగా కొనసాగడంవల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు చెప్తున్నారు. GOQii ఇండియా ఫిట్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 24 శాతం మంది భారతీయులు తమ రోజువారీ జీవితంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. వర్క్ షెడ్యూల్, ఎకానమికల్ ప్రాబ్లమ్స్ ఇందుకు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీస్ ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో చూద్దాం.
* యోగా, ధ్యానం : ఒత్తిడిని ఎదుర్కొనే అన్ని రకాల చర్యలపై దృష్టి కేంద్రీకరించాలి. ముఖ్యంగా యోగా, ధ్యానం, ప్రకృతిలో గడపటం వంటి కార్యకలాపాలు ఆనందాన్ని, విశ్రాంతిని ఇస్తాయి. అలాగే స్వీయ సంరక్షణకు ప్రయారిటీ ఇవ్వడం కూడా ఒత్తిడిని తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
* ఫిజికల్ యాక్టివిటీస్ : ప్రతిరోజూ శారీక శ్రమ కలిగి ఉండటంవల్ల మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే వ్యాయామాలు, పలు రకాల ఫిజికల్ యాక్టివిటీస్ శరీరంలో కొవ్వును కరిగిస్తాయి. అలాగే సంతోషంగా ఉండేందుకు కావాల్సిన ఎండార్ఫిన్‌లను విడుదలను ప్రోత్సహిస్తాయి. స్పీడ్ వాకింగ్, స్విమ్మింగ్ వంటివి చేయడం, వారానికి కనీసం 150 నిమిషాల మితమైన, తీవ్రత కలిగిన ఏరోబిక్ ఎక్సర్ సైజ్‌లు చేయడం ఒత్తిడిని తగ్గిస్తాయి.
* ఆహారం : తీసుకునే ఆహారాలు కూడా ఒత్తిడిని ఎదుర్కోవడంలో అద్భుతంగా పనిచేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలు గుండె ఆరోగ్యానికి మంచి చేయడంతో పాటు స్ట్రెస్ రిలీఫ్‌ను అందిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఇందుకు భిన్నంగా ఒత్తిడిని ప్రేరేపిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం బెటర్.
* మైండ్ ఫుల్‌నెస్ : మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం, వివిధ రిలాక్సేషన్ మెథడ్స్ ఒత్తిడిని, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. డీప్ బ్రీతింగ్ష్, కార్డియో వాస్క్యులర్ వర్కవుట్స్ వంటివి భావోద్వేగలను నియంత్రిస్తాయి. మంచి నిద్రను ప్రేరేపిస్తాయి. దీనివల్ల గుండెకు ముప్పు తగ్గుతుంది.
* సోషల్ కనెక్షన్స్ : సామాజిక సంబంధాలు కూడా ఒత్తిడిని దూరం చేయడంలో కీలకంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. తరచుగా లేదా అప్పుడప్పుడు మీ అభిప్రాయాలను, ఇబ్బందులను ఫ్రెండ్స్‌తో, కుటుంబ సభ్యులతో, ఇష్టమైన వ్యక్తులతో షేర్ చేసుకోవడం, సలహాలు తీసుకోవడం వంటివి మీలోని ఒత్తిడిని దూరం చేయవచ్చు. ఆందోళలను ఎదుర్కోవడానికి ఇది మంచి మార్గం. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం కూడా ఒత్తిడిని ఎదుర్కోవడంలో గొప్పగా పనిచేస్తుంది. దీనివల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు.