YS Sharmila : విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ నిరసన దీక్షలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, కాంగ్రెస్ నేతలు కేవీపీ, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై అసోంలో దాడికి ప్రయత్నించింనందుకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అసోం ఘటనపై రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. భారత్ జోడో న్యాయ యాత్ర ఈ దేశ పౌరుల హక్కుల కోసం పోరాడే యాత్ర అన్నారు. అసోంలో రాహుల్ గాంధీపై దాడి చేయాలని చూశారని ఆరోపించారు. రాహుల్ కు ప్రమాదం తలపెట్టాలని బీజేపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రశాంతంగా యాత్ర చేసుకొనే పరిస్థితులు కూడా లేవన్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేనట్లా అని మోదీ సమాధానం చెప్పాలన్నారు.