ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్‌పై ఘాటు కామెంట్స్ చేశారు. వేధింపులకు సంబంధించి అసలు కథ ఇంకా మొదలే కాలేదని, అప్పుడు భయంతో ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడితే ఎలా అని లోకేశ్ ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని, రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఇందుకు నిరసనగా ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.
దీంతో వైసీపీని భయపెడుతున్న దాడులు తగ్గుతాయని అంతా భావించారు. అబ్బే, ఢిల్లీ ధర్నాలాంటివి తమను ఏమీ చేయలేవని లోకేశ్ తేల్చి చెప్పడం గమనార్హం. రెడ్‌బుక్‌పై లోకేశ్ ఏమన్నారంటే…
“యువగళం పాదయాత్రలో దాదాపు 90 సభల్లో రెడ్‌బుక్ గురించి చెప్పాను. టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నాయకులు, అధికారులందరి పేర్లు రెడ్‌బుక్‌లో రాసుకున్నా. చట్ట ప్రకారం శిక్షిస్తామనే నా ప్రకటనకు కట్టుబడి ఉన్నా. ఇంకా రెడ్‌బుక్ తెరవకనే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారు” అని కామెంట్స్ చేశారు.
జగన్‌తో పాటు వైసీపీ నాయకులు రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఎంతగా గగ్గోలు పెట్టినా, తాను వెనక్కి తగ్గేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు. చట్టప్రకారం శిక్షించేలా చేస్తామని లోకేశ్ చెబుతున్నప్పటికీ, మన వ్యవస్థలో అవి ఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసు. చట్టాలన్నీ అధికార పార్టీ చుట్టాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యంలో రెడ్‌బుక్ రాజ్యాంగం రానున్న రోజుల్లో బలంగా అమలవుతుందని లోకేశ్ నేరుగానే చెప్పారు. ఇలా వేధిస్తూ పోతే అంతం ఎక్కడ? ఇలా అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రత్యర్థుల్ని, గత పాలనలో పని చేసిన అధికారుల్ని వేధిస్తే, అదే సంప్రదాయంగా మారితే భవిష్యత్‌లో తాము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని లోకేశ్ ఎందుకు గ్రహించలేకపోతున్నారో మరి! రాజకీయాల్లోకి వచ్చిన మొదలు అందరు కలిసి తనను ఇబ్బంది పెట్టారనే అక్కసుతోనే జగన్ విపరీత పోకడలకు వెళ్లారు. దాని ఫలితాన్ని ఎన్నికల్లో అనుభవించారు. ఇప్పుడు లోకేశ్ అదే పంథాలో నడుస్తానని చెబుతున్నారు.
కాలం నేర్పిన గుణపాఠాలను నేర్వకపోతే చేయగలిగేదేమీ వుండదు. బహుశా తనకు ఎలాంటి గుణపాఠాలు అక్కర్లేదని లోకేశ్ చెప్పకనే చెబుతున్నారు. అధికారాన్ని దక్కించుకున్న నేపథ్యంలో, ఏదో ప్రత్యర్థుల్ని ఏదో చేసేయాలనే అత్యుత్సాహం కనిపిస్తోంది. అందుకే రెడ్‌బుక్‌పై లోకేశ్ ఘాటు కామెంట్స్. పర్యవసానాల్ని కాలానికి వదిలేయడం మినహాయించి, లోకేశ్‌ను అడ్డుకునే శక్తి లేదన్నది వాస్తవం.
The post గుణపాఠాలు అక్కర్లేదంటున్న లోకేశ్! appeared first on Great Andhra.