గురువు కన్నా శిష్యుడే బెటర్


కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో ప్రకటించిన మేనిఫెస్టోనే తెలంగాణలో కూడా ప్రకటించింది. భాజపా కూటమిలో చేరిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. కర్ణాటక, తెలంగాణలో విజయవంతమైన ఎన్నికల ఫార్ములా ఆంధ్రలో కూడా విజయవంతమైంది. ఇది వరకు బాగానే ఉంది. కానీ అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పథకాలు ఎలా అమలు చేస్తారు అనే అనుమానం ఉంచుతోంది.

ఇప్పటికే ఉన్న జగన్ అమలు చేసిన పథకాలు, దానికి తోడు ఈ కొత్త పథకాలు.. అన్నీ ఎలా అమలు అవుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముందుగా అనుకున్నట్లుగా చంద్రబాబు శ్వేతపత్రాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికీ పసుపు పత్రికలన్నీ జగన్ వ్యతిరేకతతో నిండి ఉన్నాయి, కొత్త ప్రభుత్వం చేసిన పనుల వివరాలతో కాదు.

తెలంగాణ విషయానికి వస్తే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ పథకాన్ని అమలు చేశారు. కానీ ఆంధ్రలో దానిని పట్టించుకోలేదు. విధి విధానాలు అనే సాకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో, కర్ణాటకలో అమలు చేస్తున్నారు కనుక, మోడల్ ఉంది. కానీ చంద్రబాబు దాని అమలుకు ముందుకు రాలేదు.

రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించారు. అది చేయలేరని అందరూ అనుకున్నారు, కానీ చేశారు. చంద్రబాబు 15 వేల రూపాయల అమ్మ ఒడి/తల్లికి వందనం పథకాన్ని ఏడాది వెనక్కి వేశారు.

రేవంత్ రెడ్డి రైతు బంధు కిందా మీదా పడి ఏదో విధంగా సెట్ చేసారు. మరి చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి. ఇప్పటి వరకు చంద్రబాబు చేసినది ఒక్కటే: పెంచిన పింఛను అమలు చేయడం. అది తప్ప మరో రూపాయి సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు. నెలన్నర పాలనలో జగన్‌ను విమర్శించడమే జరుగుతోంది. ఉచిత ఇసుక అన్నారు, ఇప్పుడు ఆంధ్రలో రేటు పెరిగింది.

వాలంటీర్లకు పదివేల జీతం అన్నారు. మొత్తం వ్యవస్థనే పక్కన పెట్టారు. ఉద్యోగులను ఎంత రెచ్చగొట్టాలో అంతా రెచ్చగొట్టారు. జీతాలు రావడం లేదు, పింఛన్లు ఇవ్వడం లేదని. కానీ ఇప్పటి వరకు ఒక్క నెల జీతం లేదా పింఛన్లు బకాయి లేదు. అది వేరే సంగతి. కానీ తాము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కదా, డి.ఎ. బకాయిలు వస్తాయోమో అని ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు. ఇప్పటి వరకు దాని గురించి ఎటువంటి ప్రకటన లేదు.

చూస్తుంటే జగన్ ప్రవేశపెట్టిన మరే పథకం కూడా ఇప్పట్లో అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కనిపిస్తోంది. ముఖ్యమైన పథకాలు అమలుకు మరో ఏడాది పడుతుంది.

ఇక్కడ చంద్రబాబు ధైర్యం ఏమిటంటే, ఎన్నికలు మరో అయిదేళ్ల వరకు లేవు. అందువల్ల ఇప్పుడే అమలు చేసినా, రెండేళ్ల తరువాత అమలు చేసినా ఒకటే. చివర్లో అమలు చేసినా, ప్రజలు హమ్మయ్య అనుకుంటారని ధీమా. జగన్ చేసిన తప్పు అదే, అన్నీ ఒకేసారి అమలు చేసేసారు. ప్రజలు కొత్త పథకాల కోసం చూసి, చంద్రబాబు వైపు మొగ్గారు.

పైగా చంద్రబాబు అమలు చేయడం లేదు, మోసం చేసారు అని రాసే మీడియా లేదు కదా. నిత్యం ఇంకా ఇప్పటికీ జగన్ దోచేసారు అనే వార్తలు రాయడం జరుగుతోంది. అందువల్ల ప్రజలు చంద్రబాబు కేసి చూస్తూ కూర్చోవడం తప్ప వేరే దారి లేదు.

The post గురువు కన్నా శిష్యుడే బెటర్ appeared first on Great Andhra.



Source link

Leave a Comment