మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్స్ లేవు. మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై శంకర్ రీసెంట్‌గా క్లారిటీ ఇవ్వలేదు కానీ.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే చిత్రీకరణను పూర్తి చేసే అవకాశాలున్నాయని సినీ సర్కిల్స్ సమాచారం.
శంకర్ మేకింగ్ స్టైల్‌పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అయితే శంకర్ ఆలస్యం చేయటానికి తగిన కారణాలున్నాయి. ఆయన కొన్ని కారణాలతో ‘గేమ్ ఛేంజర్’తో పాటు ‘ఇండియన్ 2’ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిజానికి చరణ్ కంటే కమల్ సినిమానే కంప్లీట్ చేస్తున్నారు శంకర్. దీని వల్లే చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ లేట్ అవుతుంది. అయితే నెట్టింట మాత్రం ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అంతే కాదండోయ్ ఓ సాంగ్ కూడా లీకైంది. దీంతో మేకర్స్ అప్రమత్తమయ్యారు. తాజాగా ఈ అక్టోబర్ 28న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి తొలి సాంగ్‌ను విడుదల చేస్తున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన దసరా సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.
‘గేమ్ ఛేంజర్’ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో సీఎంగా కనిపిస్తే.. మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ చేస్తోన్న సినిమా, తొలిసారి శంకర్‌తో చెర్రీ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.