Perni Nani : జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాలో కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పవన్ వారాహి యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. కమ్మ, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎందుకు మీటింగ్ లు పెట్టడంలేదని పవన్ ను ప్రశ్నించారు. ప్రజలకు అన్నీ తెలుసని, సరైన సమయంలో తీర్పు ఇస్తారన్నారు. చంద్రబాబు నిప్పు లాంటి వ్యక్తి అంటున్న ఆయన కుటుంబ సభ్యులకు సవాల్ విసురుతున్నా అన్నారు. 1995లో అధికారం చేపట్టిన చంద్రబాబు… అప్పటి వరకూ మీ కుటుంబం ఆస్తులెన్నీ, ఇప్పుడు మీ ఆస్తులెన్నీ విచారణకు సిద్ధమా? అని సవాల్ చేశారు. చంద్రబాబు ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనపై ఉన్న కేసులపై స్టే ఆర్డర్లు తెచ్చుకుని బతుకుతున్నారన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన జాతీయస్థాయి నాయకులు ఇలాంటి జిమ్మిక్కులు ప్రదర్శించలేదన్నారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.