చంద్రబాబు- చరిత్ర మరువని దిక్సూచి Great Andhra


కేవలం “వెన్నుపోటు” అన్న ఒక్క మాటను పట్టుకుని ఆయనని కాలం ఎంత కార్నర్ చేసే ప్రయత్నం చేసినా, తనలోని బహుముఖీన ప్రజ్ఞని కాలానికి పరిచయం చేస్తూ చరిత్ర మరువని నేతగానే ఎదుగుతున్నాడు. ఒక్కోసారి ఆయనలోని హుందాతనం చూస్తుంటే శత్రువర్గానికి కూడా కించిత్ ఈర్ష్య కలుగుతుంది.

ఏ మనిషైనా కవ్విస్తే కాలుదువ్వడం సహజం. బలం లేనప్పుడు దెబ్బ తిన్న పక్షంలో, బలం రాగానే ఆలస్యం చెయకుండా పగ తీర్చుకోవడం కూడా సహజం. అలాంటి సాధారణమైన మానవసహజాలు పదవొచ్చి దాదాపు రెండు నెలలవుతున్నా చంద్రబాబు చూపడంలేదు.

తానే కాదు, తన నాయకులను కూడా సంయమనంగా ఉంచడం, స్థితప్రజ్ఞత పాటించండం చూస్తుంటే ఈయన నిజంగా ధర్మరాజు అంశేమో అనే అనుమానాలు కలుగుతాయి. బలం ఉన్నా దానిని ఊరికే ప్రదర్శించకుండా, వ్యక్తిగత భావాల్ని రాజకీయ యవనికపైకి లాక్కురాకుండా నేటి వరకు చాలా హుందాగా కనిపిస్తున్నారు.

గతం పోకడలు ఎన్ని చెప్పుకున్నా, ఏ సంఘటనని దేనితో ముడిపెట్టినా ప్రస్తుతానికి మాత్రం అన్ని విధాలుగా ఆదర్శంగా కనిపిస్తున్నారు. ఇది తాత్కాలికమా, లేక తుఫాను ముందు నిశ్శబ్దమా అనేది మున్ముందు తెలియాలి.

ఆ విషయం పక్కన పెడితే …
“చంద్రబాబు – చరిత్ర మరువని దిక్సూచి!” ఎవరికి?
తనని నమ్ముకున్నవారిలో తనకి ఉపయోగపడినవారికి.

“అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ ..” అని ఆయన పంచన చేరి ఓపిక పట్టి కూర్చుని, గణనీయంగా పని చేసి మెప్పించిన ఏ రాజకీయ నాయకుడు మోసపోలేదు.

పవన్ కళ్యాణ్ మొదట బాబుతో కొన్నాళ్ళు విభేదించినా సూక్ష్మం తెలుసుకుని తన రాజకీయ ఎదుగుదలకి చంద్రబాబు ఒక్కడే దిక్సూచి అని గ్రహించి ఆ పట్టును వీడలేదు. తన సర్వస్వాన్ని చంద్రబాబుకి అర్పించేసుకున్నాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చాడు. ఏది చేయమంటే అది చేసాడు. ఎక్కడ ఏది మాట్లాడమంటే అది మాట్లాడాడు. కాపుల ఓట్లను పోలరైజ్ చేసాడు. ఫలితం తాను చూసాడు, అందరికీ చూపించాడు. “వార్డు మెంబరుగా గెలిచి చూపించు ముందు” అన్న వాళ్లకి ఉపముఖ్యమంత్రి అయ్యి చూపించాడు. అంతా చంద్రబాబు చలవ!

అలాగే 2019లో ఓటమి పాలవ్వగానే సుజనా చౌదరిని, సీయం రమేష్ ని బీజేపీలోకి చేరి తమ మనుషులుగా పని చేయమన్నాడు. వారు సరిగ్గా అదే చేసారు. ఐదేళ్లూ తమ చిత్తశుద్ధి చాటుకున్నారు. పార్టీకి అన్ని విధాలుగా ఫండ్ రైజర్స్ రూపంలో ఉపయోగపడ్డారు. అంతే నేడు వాళ్లకి పట్టాభిషేకాలు, కిరీటాలు!!

ఎక్కడో బీజేపీలో వెంకయ్యనాయుడు నీడలో ఉన్న సత్యకుమార్ అనే సామాన్యుడిని తీసుకొచ్చి, గెలిపించి, మంత్రిని చేసేసాడు! ఎందుకంటే బీజేపీ-తెదేపా మధ్య సయోధ్యకు సత్యకుమార్ తన వంతు కృషి విశేషంగా చేసారని వినికిడి.

ఇలా ఒకరని కాదు. రామ్మోహన్ నాయుడు కావొచ్చు, నిన్న కాక మొన్న వచ్చిన పెమ్మసాని కావొచ్చు…తనని పూర్తిగా నమ్మారని తెలిస్తే అందలం ఎక్కించడం చంద్రబాబు నైజం.

పెమ్మసాని అత్యంత భారీ ఎలెక్షన్ ఫండ్ ఇచ్చారని తెలుస్తోంది. అందుకే సీనియర్లని కూడా పక్కన పెట్టి ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు.

కమ్యూనిస్టుల్లో కూడా తనని నమ్ముకుని, తనకి ఉపయోగపడినవారికి జీవితకాలం అండగా ఉండి అన్నీ చూసుకోగలడు.

ఫలానా వాడిలో విషయంతో పాటూ విశ్వాసం కూడా ఉందని తాను నమ్మాడో.. ఎక్కడో కూర్చోపెడతాడు.

చంద్రబాబుని, ఆయన ఎన్నికల వాగ్దానాల్ని నమ్ముకుని జనం మోసపోయి ఉండొచ్చు తప్ప ఆయనని దిక్సూచిగా నమ్మిన నాయకులు మాత్రం మోసపోలేదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తొచ్చు. ఇంత చెబుతున్నప్పుడు రఘురామరాజుకి అంతటి న్యాయం జరగడం లేదే అని!

ఇప్పుడని కాదు..అంతలా జగన్ మోహన్ రెడ్డిని విభేదించి, ఐదేళ్లు యుద్ధం ప్రకటించి, రెబల్ స్టార్ గా నిలబడి, కేసులు పెట్టించుకుని కష్టడీలో కొట్టించుకుని, ఆసుపత్రి పాలయ్యి..అయినా కృంగిపోకుండా అదే యుద్ధం కొనసాగించిన రాజుకి నర్సాపురం సీటివ్వకపోవడమేంటి అని పెద్ద ప్రశ్న వెల్లువెత్తింది. ఏదో బుజ్జగించి ఉండి ఎమ్మెల్యే సీటిచ్చారు. ఆయన గెలిచాడు. స్పీకర్ పోస్టని కాసేపు, ఏదో మంత్రిత్వ శాఖ అని కాసేపు వినిపించాయి. కానీ ఏవీ లేకుండా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. ఏవిటిదంతా? రాజు గారి చిత్తశుద్ధిలో లోపమేదైనా ఉందా? దానిని చంద్రబాబు గ్రహించారా? లేక రాజుగారి విశ్వాసానికి, ఓర్పుకి చంద్రబాబు పెడుతున్న పరీక్షా ఇది? జగన్ కి ఎదురుతిరిగినట్టు తనకు కూడా తిరుగుతాడని ఏదైనా అనుమానమా? ఏమో తెలీదు! ఆయన మైండులో ఏముందో!!

రఘురామరాజు విషయం పక్కనబెట్టి పిఠాపురం వర్మ విషయం పరికించినా ఇదే పరిస్థితి. అడగ్గానే పవన్ కళ్యాణ్ కి లైన్ క్లియర్ చేసి పోటీ నుంచి తప్పుకున్నాడు. పక్కనే ఉండి ప్రచారం చేసి గెలిపించాడు. దీనికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఇచ్చి అటు నుంచి మంత్రిత్వ శాఖ ఇస్తారని అనుకున్నారు. మొన్నీమధ్య రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినా అందులో ఈయన్ని భర్తీ చేయలేదు. ఇక మంత్రిత్వం ఎప్పుడో!

ఎంతో మంది కమ్మ నాయకులకి న్యాయం చేసి, ఇలా నమ్ముకున్న ఈ రాజులిద్దరికీ వెంటనే న్యాయం చేయకపోయే సరికి కుల- వివక్ష ఏదైనా ఉందా అనే అనుమానాలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కేసొక్కటీ సత్వర రాజకీయ అవసరంగా కనిపించడం వల్ల అతనినొక్కడినీ నిలబెట్టాడు తప్ప తక్కిన వాళ్ల విషయంలో అంత ఉదారంగా లేడు బాబు గారు.. అనే మాటలు వినిపిస్తున్నాయి.

అదలా ఉంటే షర్మిల కూడా ఇప్పుడు గుడ్డిగా చంద్రబాబుని దిక్సూచిగా తీసేసుకుంది. రాజకీయంగా ఆయన చెప్పినట్టాల్లా చేసే స్థితిలో ఉంది. ఎప్పుడో అప్పుడు ఆమెను కూడా అందలం ఎక్కించి జగన్ ని మరింత భంగపాటుకి గురి చేయొచ్చు కూడా.

చంద్రబాబు చరిత్ర ఇలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి గురించి మాత్రం చరిత్ర మరోలా రాసేట్టుంది. తనని నమ్ముకున్న ఏ నాయకుడూ, వ్యాపారి బాగుపడినట్టు లేదు. గత ఐదేళ్ల పాలనలో తనని ఏమార్చి నమ్మించిన నలుగురు బాగుపడ్డారు తప్ప తనని నమ్ముకున్న వారెవ్వరూ బాగుపడలేదు.

కేతిరెడ్డి లాంటి సత్తా ఉన్న నాయకులంతా మట్టికొట్టుకుపోయారు. ఎన్నో ‘కలలతో’ తనని నమ్ముకుని వచ్చిన ఒక వ్యాపారి కూడా లేనిపోని అభియోగాలు ఎదుర్కోవడం, వ్యాపారం దెబ్బతీసుకోవడం, ఐదేళ్ల కాలం వృధా చేసుకోవడం తప్ప బాగుపడిందేమీ లేదు. ఇలా ఎందరో!

పవరున్నప్పుడే తన నీడను నమ్ముకున్నవాళ్లని పట్టించుకున్నది లేదు. ఇక ఇప్పుడు పదవి లేనప్పుడు పట్టించుకోవడానికి ఆస్కారమే లేదు.

దాట్ల విజయరామరాజు



Source link

Leave a Comment