సినిమా పేరు: చారి 111
తారాగణం: వెన్నెల కిషోర్, మురళి శర్మ, సంయుక్త విశ్వనాథన్, పావని రెడ్డి, తాగుబోతు రమేష్, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ, రాహుల్ రవీంద్రన్
సంగీతం: సైమన్ కె. కింగ్
డీఓపీ: కాశీష్ గ్రోవర్
ఎడిటర్: రిచర్డ్ కెవిన్
రచన, దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్
నిర్మాత: అదితి సోనీ
బ్యానర్: బర్కత్ స్టూడియోస్
విడుదల తేదీ: మార్చి 1, 2024
ఓ వైపు కమెడియన్ గా నటిస్తూ మరోవైపు హీరోగా సినిమాలు చేస్తున్న నటులు కొందరున్నారు. వెన్నెల కిషోర్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘చారి 111’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
దేశ భద్రత కోసం మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) నేతృత్వంలో రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెంట్ టీం పని చేస్తుంటుంది. ఒకసారి హైదరాబాద్ లో మానవబాంబు దాడి జరుగుతుంది. అయితే ఆ దాడికి పాల్పడిన వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకవు. దీంతో ఆ విషయాన్ని పరిశోధించే బాధ్యతను రుద్రనేత్ర టీంలోని ఏజెంట్ చారి(వెన్నెల కిషోర్)కి అప్పగిస్తారు. అసలు పేలుడు పదార్థాలు లేకుండా ఆ దాడి ఎలా సాధ్యమైంది? ఆ దాడి వెనుకున్నది ఎవరు? ఆ విషయాన్ని ఛేదించి, చారి తనకు అప్పగించిన మిషన్ ను పూర్తి చేయగలిగాడా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
కమెడియన్ హీరోగా నటించిన సినిమాలో ప్రేక్షకులు కామెడీ ఆశించడం సహజం. అయితే మన కమెడియన్ కమ్ హీరో చేసిందే కామెడీ, మన ఏం చేసినా ప్రేక్షకులు నవ్వుతారు అనే భ్రమల్లో ఉండకూడదు. అలాంటి భ్రమల్లో ఉండి తీసిన సినిమానే ‘చారి 111’. సీక్రెట్ ఏజెన్సీ లాంటి సీరియస్ సబ్జెక్టుని తీసుకొని నవ్వించాలి అనుకున్నారు. కానీ వాళ్ళే నవ్వుల పాలయ్యారు. ఒక్క సీన్ కూడా మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఉండదు. చాలా సన్నివేశాలు నవ్వు తెప్పించకపోగా.. ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తాయి.
సిల్లీ మిస్టేక్స్ చేస్తూ అందరి చేత చివాట్లు తినే ఓ సీక్రెట్ ఏజెంట్.. ఒక పెద్ద క్రైమ్ ని ఎలా సాల్వ్ చేశాడు? అనే పాయింట్ బాగానే ఉన్నప్పటికీ.. దానిని ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఈ సినిమా కథాకథనాలు పూర్తిగా నిరాశపరిచాయి. పాత్రలను మలిచిన తీరు మెప్పించదు. దాదాపు సినిమా అంతా లాజిక్ లెస్ గానే నడిచింది. కొన్ని సినిమాలు నవ్వించడమే లక్ష్యంగా “నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్” అంటూ వస్తుంటాయి. అలా వచ్చి విజయం సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ‘చారి 111’ విషయంలో లాజిక్, మ్యాజిక్ రెండూ మిస్ అయ్యాయి. ఇలాంటి సినిమాల్లో కామెడీతో మ్యాజిక్ చేస్తేనే.. ప్రేక్షకులు కథాకథనాల్లో ఉన్న లాజిక్ లు వదిలేసి సినిమాని ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ సినిమాకి ప్రధాన అస్త్రమైన కామెడీనే చేతులెత్తేసింది. ఏజెంట్ చారిగా వెన్నెల కిషోర్ చేసే కామెడీ సిల్లీగా ఉంది. ఏదో ఒకట్రెండు చోట్ల తప్ప.. ఈ సినిమాలో ప్రేక్షకులు నవ్వుకునే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి.
ఫైనల్ గా..
వెన్నెల కిషోర్ హీరోగా నటించాడు, కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందనే అంచనాలతో ఈ సినిమాకి వెళ్తే మాత్రం నిరాశచెందక తప్పదు. సినిమాలో కామెడీ లేదా అంటే.. ఉంది. కానీ అది నవ్వు తెప్పించేలా ఉండదు.
రేటింగ్: 2/5