చిన్నవయసులోనే జుట్టు రాలడం డేంజరా? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకోండి!


posted on Jan 12, 2024 9:18AM

జుట్టు రాలడం ఇప్పట్లో పెద్దా చిన్న అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలో ఉంటోంది.  జుట్టు రాలుతున్నప్పుడు చాలామంది దాన్ని అరికట్టడానికి హెయిర్ ఆయిల్స్, షాంపూలు, హెయిర్ ప్యాక్ లు వగైరా ట్రై చేస్తుంటారు. కానీ జుట్టు ఎందుకు రాలుతోంది అనే విషయం తెలుసుకోరు.  సాధారణంగా జుట్టు రాలడం అనేది సీజన్ సమస్య లేదా వాటర్ ఎఫెక్ట్ వల్ల జరిగితే అది తొందరలోనో మార్పులు చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది.  షాంపూలు, నూనెలు ప్రయత్నించగానే కట్టడి అవుతుంది. కానీ ఎన్ని ప్రయత్నించినా జుట్టు రాలడం అనే సమస్య  తగ్గకపోతే అది  ప్రమాదకరమైనదిగానే పరిగణించాలని వైద్యులు చెబుతున్నారు.  జుట్టు రాలడం అనే సమస్య శరీరంలో మెల్లగా పెరుగుతున్న జబ్బులను సూచిస్తుందని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

ఒత్తిడి..

ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నవారు లేదా డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు జుట్టుకు సంబంధించిన సమస్యలతో సఫర్ అవుతారు. ముఖ్యంగా జుట్టు రాలడంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారని పరిశోధకులు, వైద్యులు తమ అధ్యయనాలలో  కనుక్కున్నారు. ఒత్తిడి సమయంలో విడుదలయ్యే ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ జుట్టు పెరుగుదలకు అవసరమైన మూలకణాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. ఇది జుట్టును బలహీనంగా  మారుస్తుంది.  జుట్టు సమస్యలు ఏవైనా ఉంటే వాటికి గల కారణాలను సకాలంలో గుర్తించడం మంచిది.

థైరాయిడ్ ..

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి కూడా జుట్టు రాలడం,  విరిగిపోవడమనే  ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. హైపర్ థైరాయిడిజం-హైపోథైరాయిడిజం రెండింటిలోనూ జుట్టు రాలడమనే  సమస్య  ఉండచ్చు. హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వ్యక్తులలో దాదాపు 50% మందిలో..  హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న వారిలో దాదాపు  33% మంది వ్యక్తులలో జుట్టు రాలడం కనిపిస్తుందని వైద్యుల సర్వేలలో స్పష్టం అయింది. కాబట్టి ఎక్కువ రాలిపోతుంటే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది.

పోషకాల లోపం..

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి.. శరీరంలో జుట్టు, గోర్లు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి  అనేక రకాల పోషకాలు  అవసరం. రిబోఫ్లావిన్, బయోటిన్, ఫోలేట్,  విటమిన్ B12- విటమిన్- E  లోపాల వల్ల జుట్టు రాలిపోవడం జరుగుతుంది. జింక్,  ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాల లోపం కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జుట్టు ఆరోగ్యంగా ,  దృఢంగా ఉండాలంటే  ఆహారంలో పోషక విలువలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇతర కారణాలు..

చాలామందిలో జుట్టు రాలిపోవడానికి ఐరన్ లోపం కారణమవుతుంది. ఐరన్ తక్కువగా ఉంటే  శరీరంలో హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉండి  రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఇది జుట్టు రాలిపోవడం, జుట్టు బూడిద రంగులోకి మారడం, జుట్టు పలుచబడిపోవడం మొదలైన పరిస్థితులకు కారణం అవుతుంది.  ఐరన్, జింక్ లోపాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

పైవి మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తిలో సెక్స్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ సెక్స్ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడినా కూడా జుట్టు రాలడం జరుగుతుంది. ఎవరికైనా జుట్టు రాలడం అనే సమస్య తీవ్రంగా వేధిస్తుంటే కారణం ఏంటో తెలుసుకుని ఆహారం, జీవనశైలిని చక్కదిద్దుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టడం ఆరోగ్యకరం. అంతేకానీ జుట్టు రాలుతుంది కదా అని విభిన్నరకాల షాంపూలు, నూనెలు వాడి జుట్టును మరింత దెబ్బతీయడం మంచిది కాదు.

                                        *నిశ్శబ్ద. 



Source link

Leave a Comment