చిన్న సినిమాలు.. ఓటీటీ కష్టాలు Great Andhra


నెలకు సగటును 20 సినిమాలకు తగ్గకుండా రిలీజ్ అవుతున్నాయి. అన్నీ థియేటర్లలోకి వస్తున్నాయి. మరి అవన్నీ ఓటీటీలోకి కూడా వస్తున్నాయా? అస్సలు రావట్లేదు. నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో పావు వాటా మాత్రమే ఓటీటీలో ప్రత్యక్షమౌతున్నాయి.

గత నెలనే తీసుకుందాం.. జులైలో దాదాపు 22 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కానీ ఓటీటీలో కనిపించినవి అతి తక్కువ. భారతీయుడు-2, డార్లింగ్, రాయన్ లాంటి ఐదారు సినిమాలు మాత్రమే ఓటీటీలోకి వస్తున్నాయి. మరి మిగతా సినిమాల పరిస్థితేంటి?

థియేటర్లలో ఏడాది మొత్తం తిప్పికొడితే సక్సెస్ రేటు 10 శాతం కూడా ఉండడం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నెలవారీగా చూసుకుంటే, నెలకు ఒక్క సినిమా విజయం సాధిస్తోంది. కొన్ని నెలల్లో ఆ ఒక్క సినిమా కూడా కనిపించడం లేదు.

అలా థియేటర్లలో మెరిసిన సినిమాలు ఈజీగా ఓటీటీకి వెళ్లిపోతున్నాయి. ఫ్లాప్ అయిన సినిమాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, జీ5, ఆహా, హాట్ స్టార్.. ఇలా పెద్ద ఓటీటీలు కొన్ని ఉన్నప్పటికీ చిన్న సినిమాలు, మరీ ముఖ్యంగా ఫ్లాప్ అయిన మూవీస్ ను ఇవి అస్సలు పట్టించుకోవడం లేదు.

స్ట్రీమింగ్ రైట్స్ కింద చిన్న నిర్మాతలు కోట్లు డిమాండ్ చేయడం లేదు. కనీసం లక్షల్లో వచ్చినా అదే చాలు అనుకుంటున్నారు. అయినా పని జరగడం లేదు. ఒకప్పుడు అమెజాన్ లో పే పర్ వ్యూ (చూసిన వీక్షణల ఆధారంగా పేమెంట్) ఉండేది. ఇప్పుడా పద్ధతి లేదు. ఈ విధానం ఆహాలో ఉంది కానీ నిర్మాతకు వచ్చే షేర్ చాలా తక్కువ. దీంతో చేసేదేం లేక అందినకాడికి యూట్యూబ్ లో థర్డ్ పార్టీ జనాలకు సినిమాలను అమ్ముకుంటున్నారు.

బాధాకరమైన విషయం ఏంటంటే, ఇలాంటి సినిమాలకు ఓటీటీ రైట్స్ కింద యూట్యూబ్ దళారులు 6-7 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. సినిమా నిర్మాణంలోకి దిగేముందు మధ్యవర్తుల మాటలు నమ్మి ఓటీటీ రైట్స్ కింద 60-70 లక్షల రూపాయలు వస్తాయని అంచనా వేసుకుంటున్నారు నిర్మాతలు. కానీ చివరికి వచ్చేసరికి 6-7 లక్షలకే అమ్ముకోవాల్సిన దుస్థితి. ఓవైపు థియేటర్లలో ఆడక, మరోవైపు ఓటీటీ అమ్ముడుపోక చిన్న సినిమాల నిర్మాతలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.



Source link

Leave a Comment