రూ.98 వేల కోట్ల నగదు లావాదేవీలు
వైసీపీ హయాంలో మద్యం విధానంపై కేంద్రానికి అనేక లేఖలు రాసినట్లు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. రూ.98 వేల కోట్ల ట్రాన్సాక్షన్ నగదు రూపంలో జరిగిందని, దీనిపై విచారణ జరగాలని కోరానని తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సేల్స్ లో 30 శాతం నగదు లావాదేవీలు జరిగిందని అంచనా ఉందన్నారు. అలాగే గత ప్రభుత్వంలో విక్రయించిన లిక్కర్ లో ఇంప్యూరిటీలు ఉన్నాయని, వీటి వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రజారోగ్యంతో ఆడుకుంటూ, వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అసెంబ్లీలో ప్రభుత్వా్న్ని కోరారు. ఒక్కరోజు కూడా నిల్వ లేని పచ్చి మందును డిస్టిలరీల నుంచి గత ప్రభుత్వం నేరుగా మద్యం దుకాణాల్లో విక్రయించిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. మద్యం విక్రయాలు నగదు లావాదేవీల్లో చేశారన్నారు. లిక్కర్ విషయంలో వైసీపీ చేసిన దారుణాలు ఎవ్వరూ చేయలేదన్నారు. గతంలో ఉన్న బ్రాండ్లను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.