వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసుల విషయాల్లో చేవెళ్ల, పులివెందుల చెల్లెమ్మల మాటల్లో చాలా తేడా కనిపిస్తోంది. తన తండ్రి వైఎస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టకుని జగన్ అక్రమ సంపాదనకు పాల్పడ్డారనే ఆరోపణలు సరేసరి. జగన్‌పై యూపీఏ-2 హయాంలో సీబీఐ, ఈడీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్సార్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం. అందుకే జగన్‌కు, వైసీపీ నాయకులకు కోపం.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కేబినెట్‌లో కీలక మంత్రిత్వశాఖలను నిర్వహించిన సబితారెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కేవలం జగన్‌ను టార్గెట్ చేయడానికే తన పదవుల్ని వాడుకున్నారని ఆమె వాపోయారు. తనను కూడా కేసుల్లో ఇరికించారని ఆమె చెప్పుకొచ్చారు. చేవెళ్ల చెల్లెమ్మగా వైఎస్సార్‌తో పాటు కాంగ్రెస్ శ్రేణులు నాడు ఆప్యాయంగా పిలుచుకునేవారు. ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్‌లో ఉండడంతో కాంగ్రెస్ టార్గెట్ చేసింది.
జగన్, అలాగే వైఎస్సార్‌పై కేసులకు సంబంధించి పులివెందుల చెల్లెమ్మ షర్మిల అభిప్రాయాలు భిన్నంగా వున్నాయి. అసలు తన తండ్రితో పాటు జగన్‌పై కేసులకు కాంగ్రెస్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వైఎస్సార్ కుటుంబంపై తమకు ఎలాంటి కక్ష లేదని సోనియా, రాహుల్ తనతో చెప్పారని షర్మిల పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇదే షర్మిల గతంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రిగా కాంగ్రెస్, సోనియా కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడేమో యూ టర్న్ తీసుకుని, కాంగ్రెస్ శుద్ధపూస అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జనం మాత్రం అన్ని గమనిస్తున్నారు.