ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొంత కాలంగా వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. శ్వేత పత్రాల విడుదల సందర్భంగా వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో అయిపోయిందని చెప్పడానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై మంచిగా చంద్రబాబు చెబుతారని ఎవరూ అనుకోరు. తమ ప్రత్యర్థి చేసిన మంచి గురించి చెప్పేంత సంస్కారం ఏపీ రాజకీయ నేతల్లో ఆశించలేం.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఇవాళ మీడియా ముందుకొచ్చారు, సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశంలో చంద్రబాబు విడుదల చేసిన ప్రతి శ్వేత పత్రానికి గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే బడ్జెట్ ప్రవేశ పెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని జగన్ మండిపడ్డారు. ఇదే 2019లో తాము అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం రూ.100 కోట్లు మాత్రం రాష్ట్ర ఖజానాలో వుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కానీ తాము బడ్జెట్ పెట్టకుండా, హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయలేదని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రెండు రోజుల ముందు నాటికి రాష్ట్ర ఖజానాలో సుమారు రూ.7 వేల కోట్లకు పైగా ఉందని జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో అలివికాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా … ఇదే జగన్ అధికారంలో ఉండి వుంటే అమ్మ ఒడి, రైతు భరోసాతో పాటు ప్రతి సంక్షేమ పథకం లబ్ధి కలిగి వుండేదనే చర్చ జరుగుతోందన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలివికాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదని జగన్ విమర్శించారు.
తల్లికి వందనం అని పేరు పెట్టి, ఇప్పుడు వారికి శఠగోపం పెట్టారని జగన్ మండిపడ్డారు. తల్లికి వందనం కోసం 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల పిల్లలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ అమలు ఏమైందని జగన్ నిలదీశారు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఏమైందని ప్రశ్నించారు. వీటితో పాటు తన హయాంలో రూ.14 లక్షల కోట్లు అప్పులు అయ్యినట్టు చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. కానీ గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లు అప్పులైనట్టు చెప్పించారన్నారు. ఈ రెండు నిజం కాదని జగన్ అన్నారు.
లిక్కర్ పాలసీ, మైనింగ్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అసైన్డ్ భూములు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తదితర అంశాలపై చంద్రబాబు విమర్శల్లో ఏ మాత్రం నిజం లేదని జగన్ చెప్పుకొచ్చారు.