ఏదో సినిమా తీసేసి ప్రతిపక్ష నేతల్లో కొందర్ని కమెడియన్స్‌ని చేసి.. కొందరిని విలన్‌గా చూపించేసి.. తననో మెస్సయ్య మాదిరిగా.. పోరాట యోధునిగా చూపించుకుంటే ఎన్నికల్లో ఓట్లు పడతాయా? అందరికీ మంచి చేయాలి. ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చి మరో ఛాన్స్ అడగడానికి లేకుండా చేసుకుంటే ఎలా? సంక్షేమ పథకాలు ప్రతి రాష్ట్రంలోనూ అమలవుతూనే ఉన్నాయి. వాటిని చూసుకుని విర్రవీగితే సరిపోతుందా? ఆ కొందరు ఓటేస్తే గెలిచి గట్టెక్కుతారా? సర్వేలన్నీ రాంగ్ వస్తున్నాయని.. సిట్టింగ్‌లందరినీ మార్చి పడేస్తే నష్టమెవరికి? పైగా మార్చినోళ్లను మళ్లీ మళ్లీ మారుస్తూ కొందరిని ఆశల పల్లకిలోనూ మరికొందరినీ నిరాశలోనూ ముంచెత్తితే ఇబ్బందెవరికి?
పీకే షాకింగ్ కామెంట్స్..
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఇది చాలా గడ్డుకాలం. ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అవుతోంది. తాడే పామై కాటేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై తమ కాలకేయ సైన్యంతో దాడి చేయిస్తున్నారు. వారు తల్లా.. చెల్లా అని కూడా చూడటం లేదు. ఇది కాస్త ఆయనకే నష్టం చేకూరుస్తోంది. తాజాగా ఎన్నికల వ్యూహకర్త.. 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. ఈ ఎన్నికల్లో విజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైసీపీ ప్రభుత్వానికి షాకిచ్చేలా కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఓ పత్రికా కాంక్లేవ్‌లో ఏపీ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ తన విశ్లేషణను వివరించారు.
బటన్స్ నొక్కితే ఓట్లు పడవు..
రానున్న ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమిని చవిచూడబోతున్నారని పీకే వెల్లడించారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని చెబుతూ.. వాళ్ల సొమ్మును అడ్డదిడ్డంగా ఖర్చు చేయడం దారుణమన్నారు. జగన్ చేస్తున్న ఈ తప్పిదమే ఆయనను అధ: పాతాళానికి తొక్కేయబోతోందని వివరించారు. జనాలు ఓట్లు పాలనా కాలంలో ఏం చేశారనేది చూసి వేస్తారని తెలిపారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, అభివృద్ధి అనే అంశాలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫోకస్ అవుతాయన్నారు. ప్యాలెస్‌లో కూర్చొని బటన్స్ నొక్కితే ఓట్లు పడవని.. ప్రజల మధ్యలోకి రాకపోవడం కూడా జగన్‌కు నష్టం కలిగిస్తుందని పీకే తెలిపారు. సొంత సర్వేలు చేయించుకుని వాటి రిపోర్టులను తారుమారు చేసి చూపించే జగన్‌కు పీకే వ్యాఖ్యలు తలనొప్పిగా మారతాయనడంలో సందేహమే లేదు.
ఇలా ఎందుకు చేయలేదో..?
ఐతే.. ఇదే పీకే తెలంగాణలో బీఆరెస్ గెలుస్తుందని చెప్పారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది.. దీంతో వైసీపీ కార్యకర్తలు.. పీకేని ఓ రేంజులో విమర్శిస్తున్నారు. వాస్తవానికి పీకే.. మరో లగడపాటి అయ్యారనే కామెంట్స్ చాలా రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే తాను ఇకపై సర్వేలు చేయమని.. చెప్పి ఓటమి తర్వాత అడ్రస్ కనిపించలేదు.
పోనీ ఇప్పుడు జగన్ పక్కాగా ఓడిపోతారు అని చెప్పే ఈయన.. ఒకానొక సమయంలో టీడీపీకి వ్యూహకర్తగా పని చేయడానికి అడిగితే ఎందుకు పోలేదు.. ఈజీగా చంద్రబాబును గెలిపించవచ్చు కదా.. అనేది ఇప్పుడు సామాన్యులు.. నెటిజన్లలో మెదులుతున్న ప్రశ్న. ఫైనల్ గా పీకే మాటలు ఎంత వరకు నిజం అవుతాయో మరో నెల రోజుల్లో తేలిపోనుంది.