ఓటమికి మించిన గురువు లేడు. విజయానికి మించిన శత్రువు లేడు. గెలుపు నెత్తికెక్కితే తనంతట వాడు లేడని, తానే అంతటా అని అనుకుంటాడు. జగన్ కూడా అలాగే అనుకున్నాడు. జనం తనని సంపూర్ణంగా నమ్మడం వల్ల గెలిచాను అనుకోకుండా, అదంతా తన సమర్థత అని విశ్వసించాడు. పార్టీని గెలుపు వరకూ తీసుకురావడంలో సమర్థత వుంది. ఎవరూ కాదనలేరు. కానీ పార్టీని నిలువునా ముంచేయడంలో అసమర్థత కంటే అహంకారమే ఎక్కువగా వుంది.
ఈ మధ్య జగన్ రెండు పనులు చేశాడు. ఒకటి సాధారణ విమానంలోనూ, రోడ్డు మార్గంలోనూ ప్రయాణించడం. రెండు మీడియాతో మాట్లాడ్డం.
ముఖ్యమంత్రిగా ఆయన సమయం చాలా విలువైనదని అనుకుందాం. నిరంతరం జనంలోనే, అధికారిక కార్యక్రమాల్లోనూ వుంటే ఆయన టైమ్ నిజంగా విలువైనదే. అయితే తాడేపల్లి నుంచి బయటికి రాకుండా నలుగురు కోటరీ సభ్యులతో మాత్రమే మాట్లాడే ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశామా? నిరంతరం విశ్రాంతి స్థితిలో వుండే ముఖ్యమంత్రి సమయం విలువైందని ప్రజలు నమ్ముతారా?
ఆయన హెలీకాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి కూడా వెళ్తే అది దుబారా అని జనం అనుకోరా? సీఎం ఎక్కడికి వస్తే అక్కడ చెట్లు నరికారు, పరదాలు కట్టారు, షాపులు మూయించారు. కరెంట్ కట్ చేశారు. ఇదంతా అతి అని జగన్‌కి ఒక్కసారి కూడా అనిపించలేదా? ప్రజల ఇబ్బందులు గుర్తించలేని నాయకుడికి ప్రజలు దూరం కాకుండా దగ్గర అవుతారా? ఆయన రోడ్డు మార్గంలో వస్తే ఆ ప్రాంత ప్రజలకి శిక్షగా మారితే ఓడించకుండా నెత్తిన పెట్టుకుంటారా?
ఇక మీడియా గురించి చెప్పాలంటే జగన్ అతిపెద్ద ఫెయిల్యూర్‌గా చెప్పాలి. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గురించి మీడియా ముందు గగ్గోలు పెడుతున్న జగన్‌కి, ఐదేళ్లలో మీడియా గుర్తుకు కూడా రాలేదు. మీడియా సలహాదారులతో పేషీని నింపుకుని, మీడియా ముందుకు రాకుండా ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఒకరే. ఆ రకంగా ఆయన చరిత్ర సృష్టించాడు. రాజశేఖరరెడ్డి వారసుడని జగన్ అనుకున్నాడే తప్ప, ఆయన మంచి లక్షణాలని వారసత్వంగా తీసుకోలేదు. వైఎస్ చుట్టూ అపర మేధావులు వుండేవారు. ఏ సబ్జెక్ట్ అయినా అనర్ఘళంగా మాట్లాడే ఉండవల్లి, పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ఇలా ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. జగన్ చుట్టూ నోటి దురుసు ముఠా కాకుండా విషయ పరిజ్ఞానం వున్న వాళ్లు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉన్నా జగన్ దగ్గరికి రానిచ్చాడా? దర్శనం ఇచ్చాడా?
జగన్ ఓటమికి సలహాదారులు, సర్వే బృందాలు కారణం కానేకాదు. జగనే కారణం. జగన్‌ని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసి ఓడించడం నిజం కాదు. జగన్ అహం, అతిశయం కలిసి ఓడించాయి. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడం ఓడించాయి.
ఈ రోజు చంద్రబాబు మీద మీడియా ముందుకొచ్చి దుమ్మెత్తి పోస్తున్న జగన్ , రాష్ట్ర సమస్యల మీద ఒక్కసారైనా మాట్లాడారా? ఇసుక దొరక్క ప్రజలు లబోదిబోమంటుంటే మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చాడా? మద్యం విధానం తప్పు, నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఆరోపణలు వస్తే వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడా, తాను ఎందుకు కరెక్టో మీడియా ముందు చెప్పాడా?
జగన్ మీద ఇప్పటికీ జనంలో అభిమానం వుంది. కానీ ఆయన ప్రజాస్వామ్య బద్ధంగా వుంటాడనే నమ్మకం మెజార్టీ ప్రజల్లో లేదు. అందువల్లే బటన్ నొక్కినా, విశ్వసనీయత గురించి ఉపన్యాసాలు ఇచ్చినా జనం పట్టించుకోలేదు.
జనం దరిదాపుల్లోకి రాకుండా, నా అక్కచెల్లెమ్మలు, నా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అని పడికట్టు పదాలు మాట్లాడితే ప్రయోజనం వుంటుందా? కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ మైనార్టీలు ఎన్డీఏకి ఎందుకు ఓటు వేశారో జగన్ ఆలోచించాలి.
చంద్రబాబు తప్పులు, వైఫల్యాలు , జగన్ భాషలో చెప్పాలంటే శాపాలు, పాపాలు ఇవన్నీ కలిసి మళ్లీ తననే అధికారంలోకి తెస్తాయని జగన్ కలలు కంటున్నాడు. కానీ అది భ్రాంతి. ఆ రకంగా అధికారం రాదు. ఎందుకంటే చంద్రబాబు పాలనలో తప్పులు చేసినా, హామీలు నిలబెట్టుకోలేకపోయినా కూడా జగన్‌ని అంత సులభంగా నమ్మరు. ఎందుకంటే జగన్ కంటే ఖచ్చితంగా చంద్రబాబుకి ప్రజాస్వామిక లక్షణాలు ఎక్కువ. ఈ నెల రోజుల్లో ఆయన ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చాడో, అధికారిక కార్యక్రమాల్లో ఎన్ని సార్లు పాల్గొన్నాడో పోల్చి చూస్తే అర్థమవుతుంది.
ఈ ఐదేళ్లు చంద్రబాబు తప్పుల కోసం ఎదురు చూస్తే జగన్‌కి ప్రయోజనం లేదు. ముందు తాను మారాలి, పార్టీని మార్చుకోవాలి. కార్యకర్తల్ని, ప్రజల్ని గౌరవించాలి. ప్రజాస్వామ్య లక్షణాల్ని నేర్చుకోకుండా కేవలం చంద్రబాబు తప్పులు చేస్తే అధికారం వస్తుందని అనుకుంటే అజ్ఞానం. ఉపన్యాసాలు, వాగ్దానాలతో ప్రజల్ని ఈసారి నమ్మించడం కష్టం. ఒకరిచ్చే సలహాలతో ప్రభుత్వాలు నడవవు. నిరంతర ఆత్మ పరిశీలన, సెల్ఫ్ చెక్ వుండాలి. జగన్‌కి ముఖ్యంగా కావాల్సింది అదే!
The post జగన్‌ను ఓడించింది.. ఆ రెండే! appeared first on Great Andhra.