1974 లో విడుదలైన “తాతమ్మ కల” చిత్రంతో ఎన్టీఆర్ (NTR) నట వారసుడిగా వెండితెరకి పరిచయమై తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగి.. తండ్రికి తగ్గ తనయుడుగా అందరి ప్రశంసలు పొంది, విశ్వవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినీ ప్రస్థానం 50 వసంతాలు పూర్తి చేసుకోవడం అరుదైన గౌరవం. భారతదేశ సినీ చరిత్రలో నట వారసుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక అగ్ర కథానాయకుడుగా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి ఎన్టీఆర్ తర్వాత నేటితరంలో పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలు చేసి.. అన్ని జనరేషన్స్ ప్రేక్షకులను మెప్పించిన ఒకేఒక్కడు బాలయ్య.
ఈ ప్రతిష్టాత్మక 50 వసంతాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలను NBK HELPING HANDS అధ్యక్షులు అనంతపురం జగన్.. బాలయ్య అభిమానులను ఒక టీమ్ గా ఏర్పాటుచేసి అత్యంత వైభవంగా 50 రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా హైదరాబాద్ లో ఘనంగా వేడుకలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు
గతంలో NBK HELPING HANDS ఆధ్వర్యంలో బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం 70 రోజుల పాటు భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర ని చేపట్టి ఒక చరిత్రను సృష్టించారు. అంతేకాకుండా బాలయ్య 60వ పుట్టినరోజు వేడుకలను విశ్వవ్యాప్తంగా ఉండే బాలయ్య అభిమాన సోదరులందరు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒకే సమయంలో తొంభై వేల మందికి పైగా కేక్ కట్ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పి బాలయ్య అభిమానుల సత్తాని చాటారు.
ఇప్పుడు .. మరోసారి మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మా బాలయ్య కోసం అభిమానులందరు కలిసి అతిపెద్ద పండుగ చేయబోతున్నాం.. అభిమానులందరి తరుపున ఈ వేడుకను నిర్వహించడానికి అవకాశం కల్పించిన బాలయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంటూ అనంతపురం జగన్ తన సంతోషాన్ని పంచుకున్నారు.