మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తన బలం ఏంటో తెలియకుండానే ఐదేళ్ల పాటు తాడేపల్లిలో ఇంటికే పరిమితం అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్‌తో పాటు ఆయన్ను నమ్ముకున్న వారికి కష్టాలు మొదలయ్యాయి. అయితే తన బలం జనమే అని బహుశా ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. జగన్ బయటికొస్తే చాలు జనాదరణకు తక్కువేం వుండదు.
ఇటీవల పులివెందుల పర్యటనకు వెళ్లినప్పుడు పెద్ద సంఖ్యలో జగన్‌ను కలవడానికి జనం వెళ్లారు. పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం కావడం వల్లే జనం వెళ్లారని అనుకోవచ్చు. కానీ పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కూడా పులివెందులకు మించి జనాదరణ లభించడం విశేషం. జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు జనం పోటీ పడడం సహజంగానే ప్రత్యర్థులకు ఆందోళన కలిగించే అంశమే.
వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను అందరూ చూస్తుండానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ విషయం తెలిసి బెంగళూరు నుంచి జగన్ హుటాహుటిన తాడేపల్లికి వచ్చారు. ఆ మరుసటి రోజు శుక్రవారం వినుకొండకు తాడేపల్లిలో ఉదయం 10 గంటలకు బయల్దేరారు. 120 కిలోమీటర్లు చేరుకోడానికి ఏడు గంటల సమయం పట్టిందంటే… జనం ఎంతగా వెల్లువెత్తారో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైన పరిస్థితిలో తాజాగా జగన్‌కు లభించిన జనాదరణను చూస్తే ఆశ్చర్యం కలగకుండా వుండదు. వీళ్లంతా స్వచ్ఛందంగా జగన్‌ను చూడడానికి వచ్చిన వారే అని పలువురు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్‌ను చూడడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న సామాన్య ప్రజానీకం, అలాగే లారీల్లో వెళుతున్న వారు ఉత్సాహం చూపడం గమనార్హం. ఐదేళ్లపాటు జనానికి జగన్ దూరం కావడం వల్లే దారుణ ఫలితాల్ని మూటకట్టుకోవాల్సి వచ్చిందనే విమర్శ వుంది.
ఈ నేపథ్యంలో జగన్ జనంలోకి రావడం, భారీ స్పందన లభించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఒకవైపు అధికారంలో ఉన్న కూటమి నేతలు భయాందోళనలకు గురి చేస్తున్నా, తమ నాయకుడిని చూసేందుకు వైసీపీ శ్రేణులు జెండాలు పట్టుకని మరీ రోడ్డుపైకి రావడం వైసీపీకి శుభపరిణామంగా చెప్పొచ్చు.
తన బలమే జనమని, చుట్టూ ఉన్న కోటరీ కాదని ఇప్పటికైనా జగన్ మేల్కోవాల్సిన అవసరం వుంది. కోటరీతో పాటు కోట్లాది రూపాయలు చెల్లించి పెట్టుకున్న ఐ-ప్యాక్ టీమ్, సర్వే భజన బృందాల వల్ల నష్టమే అని జగన్‌కు అర్థమై వుండాలి. తన చుట్టూ ఉండే రకరకాల కోటరీ నేతల మాటలు నమ్మి మోసపోయానని జగన్‌కు జ్ఞానోదయం అయితే మంచిది.
జనంతో ఉంటే, వాస్తవాల్ని వాళ్లే చెబుతారు. పులివెందుల, వినుకొండ పర్యటనలు జగన్‌కు భవిష్యత్‌పై తప్పకుండా భరోసా ఇచ్చి వుంటాయి. తన అసలు బలం జనమే అని జగన్‌కు చాలా త్వరగానే తెలిసి రావడం వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుంది. రానున్న రోజుల్లో నిత్యం జనంతో మమేకం కావడానికి ప్రజాదరణ ప్రేరణగా నిలిచే అవకాశం వుంది.
The post జగన్.. జనం! appeared first on Great Andhra.