నిరంతరం ఏదో ఒక యాత్రతో ప్రజల మధ్య వుంటూ అధికారంలోకి వచ్చిన జగన్, ఆ తరువాత ప్రజల్ని మరిచిపోయాడు. ఫలితం చూస్తున్నాడు. అధికారంలో వుంటే విశ్రాంతి, ప్రతిపక్షంలో వుంటే పోరాటం పాలసీగా మార్చుకుంటే నమ్మడానికి జనం అమాయకులు కాదు.
అంతకు మునుపు వేరు. ఇపుడు వేరు. 2014 నుంచి ఐదేళ్లు ఆయన చేసిన యాత్రలు, పోరాటాలు, ఉపన్యాసాలు అన్నీ ప్రజలకి నచ్చాయి. ఒక అవకాశం ఇచ్చి చూడాలనుకున్నారు. ఇచ్చారు, చూసారు.
ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రసంగం విన్నవాళ్లు ముచ్చట పడ్డారు. నిరంతరం జనంలో వుంటూ, జనం తరపున మాట్లాడే ముఖ్యమంత్రి వచ్చాడనుకున్నారు. కానీ ఆయన కనబడడు, వినబడడు. సలహాదారుల పాలన సాగిస్తాడని వూహించలేకపోయారు. జగన్ సూపర్ సక్సెస్ తర్వాత చంద్రబాబు, పవన్ ఇక కోలుకోవడం కష్టం అని రాజకీయ పరిశీలకులు కూడా అనుకున్నారు. సరిగ్గా రెండేళ్లకే చతికిల పడిన చంద్రబాబుని లేచి నిలబెట్టిన ఘనత జగన్‌దే.
మంత్రులందరినీ డమ్మీలుగా మార్చి కేవలం సలహాదారుడే అందరి తరపున మాట్లాడడం గతంలో ఎపుడూ జరగలేదు. జరగదు కూడా. మళ్లీ జగన్ వస్తే తప్ప.
ముఖ్యమంత్రిగా తాను ప్రజలకి కనబడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూచుని పాలన సాగిస్తే చాలు అనే భ్రాంతికి జగనే గురయ్యాడా? లేదా సలహాదారుల కూటమి ఆయన్ని ఆ మాయలోకి నెట్టిందో తెలియదు. మంత్రులు, ఎమ్మెల్యేలకి కూడా కనబడకుండా, కేవలం నలుగురు సలహాదారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడమే పాలన అని జగన్ అనుకుంటే అది మూర్ఖత్వమా? అమాయకత్వమా? లబ్ధిదారులకి బటన్ నొక్కుతూ, నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు, అక్కచెల్లెమ్మ, అవ్వాతాతలు అని మంత్రం జపిస్తే ఓట్లేస్తారా?
తండ్రి వైఎస్ పేరుని పదేపదే స్మరించే జగన్, వైఎస్ నుంచి ఏమీ నేర్చుకోలేదు. తానే సర్వస్వం, తనకి అంతా తెలుసు అనుకోవడం జగన్ లక్షణం. అందరూ వుంటేనే తాను, అందరి నుంచి అన్నీ తెలుసుకుంటూ వుండడమే పాలన అని నమ్మిన వ్యక్తి వైఎస్. అందుకే ప్రజాదర్బార్‌లో సామాన్యుల కష్టాలు, సమస్యలు దగ్గరుండి వినేవాడు, పార్టీలోని అన్ని వర్గాల వారితో సన్నిహితంగా వుంటూ అనేక విషయాలు వాళ్లతోనే మాట్లాడించేవాడు. జగన్ కేవలం ఒక వర్గాన్నే చుట్టూ పెట్టుకుని, చివరికి ఆ వర్గానికి కూడా దూరమయ్యాడు.
వైఎస్ ఒకసారి నమ్మితే, వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లేవాడు. ఆయనని నమ్మిన వాళ్లు కూడా అంతే విధేయతతో వుండేవాళ్లు. ప్రతిపక్షంలో వుంటూ వైఎస్ పోరాటం చేస్తున్నపుడు, కాంగ్రెస్‌లోనే ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటున్న సమయాల్లో కూడా ఆయన విధేయులు వెంటే వున్నారు. ప్రలోభాలకి లొంగిపోలేదు.
వైఎస్ వారసుడిగా జగన్ కూడా అలాగే వుంటాడని అనుకున్నారు. వున్నాడు కూడా. అధికారం వచ్చిన తర్వాత కథ మారింది. సీనియర్ నాయకులకి కూడా గౌరవం లేదు, గుర్తింపు లేదు. అన్ని నిర్ణయాలు కోటరీవే. మాగుంట, వేమిరెడ్డి, లావు కృష్ణదేవరాయలు, ఆనం, కోటంరెడ్డి ఇలా చాలా మందిని జగన్ దూరం చేసుకున్నాడు తప్ప, వాళ్లు దూరం కాలేదు. చివరికి వాళ్లందరికీ అధికారం వచ్చింది, జగన్‌కి దూరమైంది.
ఘోర ఓటమి తర్వాత కూడా జగన్‌లో పెద్దగా మార్పులేదు. ఇప్పటికీ అదే కోటరీ. జగన్‌కి పాలన చేతకాదని రుజువు చేసిన కోటరీ. యుద్ధ విద్య తెలియని సేనాపతులతో యుద్ధం చేయగలనని నమ్మే పాలకుడు.
ఐదేళ్లు మీడియా ముఖం చూడని జగన్, ఇపుడు తన గొంతు వినిపించడానికి మీడియానే ఆశ్రయిస్తున్నాడు. మంత్రులకి కూడా ప్రవేశం లేని తాడేపల్లిలో కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని కలుస్తున్నాడు. చేతులు కాలి చాలా కాలమైంది. చికిత్స అంత సులభం కాదు.
కేవలం చంద్రబాబు తప్పులు చేస్తే, పథకాలు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం వస్తుందని జగన్ కలలు కంటున్నాడు. ఐదేళ్లు చాలా సుదీర్ఘ కాలం. జగన్ పాలన అంటేనే చాలా వర్గాలు భయపడిపోయి ఉన్నాయి. ఆ రేంజ్లో భయపెట్టాడు.
తప్పులు, వైఫల్యాల్ని సమీక్షించుకుని, విశ్లేషించుకుని తనని తాను మార్చుకుంటేనే జగన్‌కు భవిష్యత్తు. ఇది ప్రజల సలహా. లక్ష మంది సలహాదారుల కంటే ఒక సామాన్యుడు గొప్పవాడు.
నేనింతే, ఇలాగే వుంటా. చంద్రబాబుకి నేనే ప్రత్యామ్నాయం అనుకుంటే రాజకీయాల్లో శాశ్వత విశ్రాంతే. చరిత్ర తానే ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టిస్తుంది. అది పవన్ రూపంలో కనిపిస్తూ వుంది. జాగ్రత్త.
పవర్ లేని ఫ్యాన్ కేవలం ఒక ఇనుప వస్తువు మాత్రమే.
The post జగన్ దూరమయ్యాడా? దూరం చేసారా? appeared first on Great Andhra.