జగన్ పరాజయ కారణాలు 02 Great Andhra


అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ప్రయోగాలు చేపట్టి జగన్ దెబ్బ తిన్నాడని మొదటి వ్యాసంలో రాశాను. సోషల్ ఇంజనియరింగ్ చేస్తున్నా అంటూ కులస్పృహ విపరీతంగా ఉన్న ఆంధ్ర సమాజంలో సమీకరణాలు మార్చేయబోయాడు. కాంగ్రెసుకు రెడ్లు, కాపుల మద్దతు, టిడిపికి కమ్మలు, బిసిల మద్దతు సాంప్రదాయంగా ఉంటూ వచ్చింది. తక్కిన అగ్రకులాల (ద్విజవర్గాలు అంటాను)లో ఎక్కువ మంది టిడిపికి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలలో ఎక్కువమంది కాంగ్రెసుకి మద్దతుగా ఉంటూ వచ్చేవారు. కాంగ్రెసు ఓటు బ్యాంకంతా వైసిపికి షిఫ్ట్ అయిపోయింది. 2014-19 మధ్య బాబు కాపు, బిసిల మధ్య బాలన్సు చేయబోయి, యిద్దరి ఆగ్రహాన్నీ చవి చూశారు. రెండు వర్గాల్లో అధికాంశం ఓటర్లు టిడిపికి వ్యతిరేకంగా, వైసిపికి అనుకూలంగా వేయడంతో జగన్ అధికారంలోకి వచ్చాడు.

ఇక వచ్చిన దగ్గర్నుంచి టిడిపిని ఎలా క్షీణింప చేయాలా అన్నదానిపైనే దృష్టి పెట్టాడు. ఏం చేసినా కమ్మలు టిడిపిని విడిచి పెట్టరు కాబట్టి, వాళ్లను ఆకర్షించే, కనీసం అనునయించి తన పట్ల సానుకూలంగా చేసుకునే ప్రయత్నం బొత్తిగా చేయలేదు. బాబుపై కోపంతో యావత్తు కమ్మలపై కక్ష కట్టినట్లు వ్యవహరించి, బాబు విధానాలతో ఏకీభవించని కమ్మలతో బాటు, తటస్థులను కూడా దూరం చేసుకున్నాడు. నిజానికి 2019 ఎన్నికలలో కమ్మలలో 65% మంది మాత్రమే టిడిపికి ఓటేశారని కొన్ని సర్వేలు చెప్పాయి. కానీ జగన్ కమ్మల పట్ల స్నేహభావాన్ని కనబరచ లేదు. నిమ్మగడ్డ ఉదంతంలో ఆయనా, బాబు ఒకే కులానికి చెందినవారంటూ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి ఘోరమైన తప్పు చేశాడు. రాజకీయ సభలో మాట్లాడితే అదో దారి. ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఒక పర్టిక్యులర్ కులం వాళ్లు నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని మాట్లాడడం ‘నేను జనాభాలో ఒక సెక్షన్‌కు వ్యతిరేకం’ అని చెప్పుకున్నట్లే!

నియమాలు పాటించని వ్యక్తులు, రూల్సు అతిక్రమించే సంస్థలు అనేకం ఉంటాయి. కానీ వాటిలో కమ్మ వారి సంస్థల మీద మాత్రమే గురి పెట్టినట్లు వ్యవహరించింది జగన్ ప్రభుత్వం. అమర రాజా సంస్థ పర్యావరణాన్ని కలుషితం చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అనేక పరిశ్రమలు చేసే పనే అది. దానికై ప్రభుత్వం నోటీసులపై నోటీసులు యిస్తూ ఉంటుంది. వాళ్లు కోర్టుకి వెళుతూ ఉంటారు. వీళ్లు హెచ్చరికలు చేస్తూ ఉంటారు. కానీ అమరరాజా కేసులో మాత్రం కరంటు సరఫరా ఆపేశారు. పర్యావరణ హానికి, కరంటు సప్లయికి లింకేమిటి? గల్లా జయదేవ్ సరిదిద్దుకుంటాం అని చెప్పకుండా రాష్ట్రం నుంచి పరిశ్రమను తరలించేస్తాం అని బెదిరించారు. అది తప్పయితే దానికి ప్రతిగా సజ్జల ‘పోతే పొండి’ అనడం మరీ తప్పు. ఏ ప్రభుత్వ ప్రతినిథీ పారిశ్రామిక వేత్త నుద్దేశించి అలా మాట్లాడడు. సజ్జల స్టేటుమెంటుపై రగడ వచ్చినపుడు ముఖ్యమంత్రి కలగచేసుకుని దిద్దుబాటు స్టేటుమెంటు యివ్వాల్సింది. కానీ అదేమీ చేయలేదు.

ఎందుకంటే జగన్ సమాజాన్ని కమ్మ-నాన్ కమ్మగా విడదీసి బలపడదా మనుకున్నాడు. ఎవరికి రుచించినా, రుచించకపోయినా అమెరికాలో జ్యూయిష్ లాబీలా ఆంధ్రలో కమ్మ లాబీ చాలా బలవత్తరమైనది. మేధస్సు, ధనం, కఠోర పరిశ్రమ, చొరవ, పలుకుబడి, ఐకమత్యంతో వాళ్లు అన్ని రంగాల్లోకి ప్రవేశించి ఎగబాకి, ఆ రంగంలో అంతకు ముందు ఎస్టాబ్లిష్ అయినవారిని తోసిరాజని కొన్నిట్లో శాసించే స్థాయికి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా వారి ప్రభావం కొంతమేరకే ఉన్నా ఆంధ్ర విడిపోయాక మితి లేకుండా పోయింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతం విడిపోతానన్నపుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఆంబేడ్కర్ అలా ఏర్పడే రాష్ట్రం కమ్మ-రెడ్డి కులాల మధ్య కురుక్షేత్రంగా మారుతుందని హెచ్చరించాడు. మూడేళ్ల తర్వాత తెలంగాణతో కలవడం వలన ఆ వాతావరణం పలచబడింది. ఇప్పుడు మళ్లీ పాత ఆంధ్ర ఏర్పడింది కాబట్టి సిసలైన కురుక్షేత్రం తిరిగి వచ్చేసింది.

కమ్మ-రెడ్డి సమీకరణం విషయంలో 1953 నాటికి 2014 నాటికి మధ్య తేడా రావడానికి కారణం 1983లో తెలుగుదేశం ఏర్పడ్డం! ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వ్యతిరేకిస్తూ శ్రీశ్రీ ‘‘తెలుగు రాజ్యమేర్పడితేను, తొలి వజీరు రెడ్డి, తాగడానికి కుళ్లునీళ్లు, తినడానికి గడ్డి!’’ అన్నాడు. ఇప్పుడైతే రెడ్డే వజీరు (ముఖ్యమంత్రి) అవుతాడని చెప్పే పరిస్థితి లేదు. కమ్మలకే ఎక్కువ ఛాన్సుంది. జనాభాలో వాళ్లు ఎంత శాతం ఉన్నారనేది యిక్కడ ప్రధానాంశం కాదు. వారు ఎంతమందిని యిన్‌ఫ్లుయెన్స్ చేయగలరు, ఎంతమంది చేత ఓట్లు వేయించగలరు అనేది ముఖ్యం. హిట్లర్ ఎదిగే కాలంలో జర్మనీలో యూదుల బలం ఎలా వుండేదంటే, ఫ్యాక్టరీ యజమానులు యూదులు, వర్కర్స్ యూనియన్ లీడర్లూ యూదులే. పత్రికాధిపతులూ, పాత్రికేయులూ, వ్యాపారస్తులూ, పారిశ్రామిక వేత్తలూ అందరూ యూదులే!

వారు కష్టపడి డబ్బు సంపాదించేవారు, దానితో అన్ని పనులూ సాధించేవారు. వాళ్లని ఎదిరించిన వారిని నిలవరించడానికి మేధోపరమైన, ధనపరమైన, సామాజికపరమైన అన్ని రకాల శక్తియుక్తులు కలిగి ఉండేవారు. ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ హిట్లర్ సాధారణ జర్మన్లను వారికి వ్యతిరేకంగా మలచుకున్నాడు. యూదులు వేరే మతస్తులు కావడం, సమాజంలో కలవకుండా తమ ఐడెంటిటీని విడిగి మేన్‌టేన్ చేయడం వలన అది సాధ్యపడింది. దానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఆంధ్రలో కమ్మలు వేరే జాతి వారు కాదు. సమాజంలో భాగమే. వారిని విడిగా ఎత్తి చూపించి మాట్లాడడం కుదరదు. కానీ సమాజపు ఆలోచనలను గాఢంగా ప్రభావితం చేయగలిగిన పత్రికా రంగం, సినిమా రంగం వారి చేతిలోనే ఉంది. విద్యపై శ్రద్ధ పెట్టి అడ్మినిస్ట్రేషన్‌లోను, న్యాయరంగంలోనూ అగ్రస్థానాల్లో ఉన్నారు. భూమి లావాదేవీల్లో, పరిశ్రమలు స్థాపించడంలో వారికి ఎదురే లేదు.

ఎన్నో దశాబ్దాలుగా సాగుతూ ఉన్న యీ విస్తరణ నేడు వందలాది ఊడలున్న మహా వటవృక్షంగా మారింది. జగన్ జస్ట్ ఐదేళ్ల కాలంలో దాన్ని వేళ్లతో సహా కూలగొట్టేయ గలనని అనుకుని, బొక్కబోర్లా పడ్డాడు. బయటకు కనబడకుండా ఒక్కో కొమ్మా విరుస్తూ పోతే ఎంతో కొంత సాధించేవాడేమో కానీ ఏకంగా కాండంపైనే గొడ్డలి ఎత్తేసరికి ఆ వర్గమంతా ఏకమైంది. జగన్ ఏం చేయబోయినా మీడియా యాగీ చేసింది, కోర్టు అడ్డుకట్టలు వేసింది. జగన్ ఓడడానికి స్వీయ తప్పిదాలు చాలా ఉన్నాయి. కానీ కమ్మవారిని రాంగ్ సైడ్ రబ్ చేయడం చేతనే చావుదెబ్బ తిన్నాడని నా అభిప్రాయం. కోర్టులు మొట్టికాయలు వేస్తూన్నా, మీడియా ఉతికి ఆరవేస్తున్నా, జగన్ తన పద్ధతి ఎందుకు మార్చుకోలేదు? తన దాడిని ఎందుకు స్లో చేయలేదు? కమ్మ వ్యతిరేకిగా ముద్ర వేయించుకుంటే వారితో పోటీ, స్పర్ధ, వైరం ఉన్న కులాలన్నీ తనను హీరోగా చూసి తన వెనుక ర్యాలీ అవుతాయని అంచనా వేయడం వలన!

ఉమ్మడి రాష్ట్రంలో కూడా యీ కమ్మ-రెడ్డి గోల ఉండేది. 2004లో బాబు ఓడిపోతాడని ఊహించలేక టిడిపి కులం కోణాన్ని పెద్దగా తేలేదు. కానీ కాంగ్రెసు గెలిచి, వైయస్ ముఖ్యమంత్రి అయి, 2009 నాటికి మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి టిడిపి కులాన్ని విపరీతంగా ప్రొజెక్టు చేసింది. వైయస్ హయాంలో రెడ్లకే అన్నీ దోచి పెట్టాడని, కమ్మలు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేశాడని సౌమ్యుడిగా పేరుబడిన మురళీ మోహన్ సైతం సభలో మాట్లాడారు. ఆ కాలంలో వ్యాపారంలో నష్టం వచ్చిన కమ్మ సంస్థలేమిటో ఆయనకే తెలియాలి. ఎవరు అధికారంలో ఉన్నా, కమ్మలు క్రమం తప్పకుండా ఎదుగుతూనే ఉన్నారు. ధనయజ్ఞంగా పేరుబడిన జలయజ్ఞపు కాంట్రాక్టర్లలో కమ్మవారే ఎక్కువ అని వినబడింది.

దురదృష్టమేమిటంటే అధికారులను కూడా కులం కోణంలో చూడసాగారు. ఓ పాతికేళ్లు సర్వీసు చేసి, ప్రమోషన్ తెచ్చుకుంటే కమ్మ కాబట్టి వచ్చిందని కాంగ్రెసు, రెడ్డి కాబట్టి వచ్చిందని టిడిపి అల్లరి చేసేవి. కులరీత్యా ఐఏఎస్‌ల జాబితాలు ప్రకటించేవి. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో యీ దరిద్రం వదిలింది, ఆంధ్రలో పెచ్చుమీరింది. కాంగ్రెసు స్థానంలో వైసిపి వచ్చింది, అదొక్కటే తేడా. 2014-19 మధ్య సాగిన టిడిపి పాలనలో చంద్రబాబుకు కమ్మ పక్షపాతి అనే ముద్ర పడింది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ పేరు లేదు. ఆంధ్ర రాజధాని ఎంపిక దగ్గర్నుంచి, ఆ కులస్తులే అక్కడ ఎక్కువగా పెట్టుబడి పెట్టడం, ప్రచారం చేయడం వలన ఆ ముద్ర స్థిరపడింది. గణాంకాల మాట ఎలా ఉన్నా పబ్లిక్ పెర్‌సెప్షన్ మాత్రం అదే. దాంతో 2019 ఎన్నిక కమ్మ-నాన్ కమ్మ ఎన్నికగా జరిగింది. కాపు, బిసి కులాల్లో చీలిక వచ్చింది. ద్విజ కులాలలో క్షత్రియులు వైసిపివైపు మొగ్గారు. దానాదీనా వైసిపి నెగ్గింది.

వైసిపి నెగ్గిన దగ్గర్నుంచి, యిది రెడ్ల రాజ్యం అనే టిడిపి ఆరోపించ సాగింది. వైయస్ కాలంలోనూ యిదే ఆరోపణ కానీ అంది అంత స్టిక్ కాలేదు. కానీ జగన్ విషయంలో ఆ మచ్చ అతుక్కుంది. కారణం ఏమిటంటే జగన్ చుట్టూ ఉన్న కోటరీ. ప్రతి ముఖ్యమంత్రికీ కోటరీ (ఆంతరంగిక బృందం) ఉంటుంది. వైయస్ కోటరీలో చూడండి, కెవిపి, ఉండవల్లి, జక్కంపూడి.. యిలా వివిధ కులాల వారున్నారు. చంద్రబాబు కోటరీలో చూడండి, యనమల, అచ్చెం నాయుడు, నారాయణ, అశోక గజపతి రాజు.. యిలా వివిధ కులాల వారున్నారు. మరి జగన్ చుట్టూ..? పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి.. అందరూ రెడ్లే. చుట్టూ ఉన్న అధికారులూ రెడ్లే! పబ్లిక్ పెర్‌సెప్షన్ ఎలా ఉంటుందో ఊహించండి. నోరు విప్పితే ‘నా బిసి, నా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ..’ అంటాడు కానీ దోచి పెట్టేదంతా రెడ్లకే అనుకోరూ?

ఈ పెర్‌సెప్షన్‌ను మరింతగా బలపడేట్లు చేయగలిగింది కమ్మ లాబీ. 2009లో బాబును గెలిపించడానికి కృషి చేసిన యీ లాబీ, 2024 వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో నైనా జగన్‌ను ఓడించి తీరాలనే కక్షతో పని చేసింది. ఎన్నికలయ్యాక కూడా జగన్‌ తిరిగి లేవకుండా పూర్తిగా భూస్థాపితం చేసేయాలని రంకెలు వేస్తోంది. ప్రపంచంలోని కమ్మలందరినీ (మరీ పేదలైతే తప్ప) ఏకత్రాటిపై తెచ్చి తన సంహారం కోసం పోరాడే బలమైన సైన్యంగా మార్చిన ఘనత జగన్‌దే! నాకు తెలిసి ఏ నాయకుడూ యింతలా ఏ కులాన్నీ యీ స్థాయిలో వ్యతిరేకం చేసుకోలేదు. ఈ లాబీ అనేక మంది తటస్థులుగా గోచరించే వ్యాఖ్యాతల ద్వారా మామూలు మీడియానే కాదు, సోషల్ మీడియాను, వాడుకోలిగింది. అనేక విషయాల్లో జగన్ యిమేజిని భ్రష్టు పట్టించింది.

ఇలా వ్యాఖ్యానించే వారందరూ పక్షపాతరహితులే అనే భ్రమ కల్పించడానికి వారికున్న ఎడ్వాంటేజి కమ్మల్లో చాలామంది కులసూచకాన్ని ధరించక పోవడమే! రెడ్లకు ఆ సౌకర్యం లేదు. వారందరూ తమ పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం చేత వీడియో ప్రారంభం కాగానే ‘ఇతను కులాభిమానంతో చెప్తున్నాడా?’ అని శ్రోత అనుమానించడం మొదలుపెడతాడు. వింతేమిటంటే కొందరు క్రైస్తవులే కాదు, హిందువుల్లోనూ రెడ్లు కాని వారు సైతం రెడ్డి అని పెట్టుకుంటారు. కమ్మలకు యీ సమస్య లేదు. చౌదరి అని పర్టిక్యులర్‌గా పెట్టుకున్న వారిని తప్పిస్తే, తక్కిన వారి విషయంలో పేరు బట్టి కమ్మ అనుకునే వీలు లేదు. చివర్లో రావు, మూర్తి, బాబు, కుమార్..యిలా జనరిక్‌గా ఉంటుంది. కొందరికి నాయుడు అని ఉన్నా అది అనేక కులాలు పెట్టుకునే పేరు కాబట్టి యితమిత్థంగా ఏమీ చెప్పలేరు.

ఆ కులానికి చెందకపోయినా ఆ పార్టీ పట్ల అభిమానం చేతనో, ఆర్థిక కారణాల చేతనో టిడిపికి అనుకూలంగా మాట్లాడేవారు కుప్పలుతెప్పలుగా ఉన్నారు. వీరంతా దశాబ్దాలుగా అవలంబిస్తున్న టెక్నిక్కు ఒకటుంది. రాజకీయ నాయకులందర్నీ తిడుతూ వచ్చి మన దృష్టిని ఆకర్షించి, మన ఆమోదాన్ని సంపాదిస్తారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ‘అందరిలోనూ లోపాలున్నాయి కానీ చంద్రబాబు లెస్సర్ ఈవిల్. మిగతా వాళ్లు బ్రహ్మరాక్షసులు. అందువలన యీసారికి యిలా పోనిచ్చి, టిడిపికి ఓటేసేద్దాం’ అంటారు. టిడిపి గెలవబోతోందని మనల్ని సైకలాజికల్‌గా డ్రైవ్ చేస్తారు. నాకు తెలిసి బాబు ముఖ్యమంత్రి అయినప్పట్నుంచి ఏ మీడియా ఏ ఎన్నికలోనూ బాబు ఓడిపోతాడని చెప్పలేదు. కానీ బాబు కొన్నిసార్లు ఓడిపోయారు. అంటే వీళ్లు ప్రజాభిప్రాయాన్ని ప్రతిధ్వనించటం లేదన్నమాట. ఇలాటి వాళ్లు 2019లో బాబు పరాభవం తర్వాత ముసుగులు తీసేశారు. ఫ్రమ్ డే వన్ జగన్ని తిట్ట నారంభించారు. దీన్ని వైసిపి దీటుగా ఎదుర్కోలేక పోయింది.

ఇక రెడ్ల విషయానికి వస్తే జగన్ పాలనలో తమకు ఒరిగిందేమీ లేదని వాళ్లు అసంతృప్తిగా ఉన్నారని నేను రాస్తే, కొందరు జగన్ కోటరీని చూపించి ‘ఇదిగో వీళ్లంతా రెడ్లు కారా?’ అని అడిగారు. ఈ పది, పదిహేనుమందికి మేలు కలిగితే రాష్ట్రంలో యావన్మంది రెడ్లకు మేలు కలిగినట్లా? కర్ణాటకలో లింగాయతుల్లా, మహారాష్ట్రలో మరాఠాల్లా, ఆంధ్రప్రదేశ్‌లో రెడ్లు రాజకీయాలను నమ్ముకున్నవారు. కాంట్రాక్టు వ్యాపారాల్లో సంపాదిస్తూ, రాజకీయ జూదం ఆడుతూ, పదవులు అనుభవిస్తూ, నెగ్గినా ఓడినా అనుచరగణాన్ని పోషిస్తూ వస్తారు. వాళ్లకు కావలసినది, ఊరిలో తమ మాటే చెల్లుబాటు చేసుకునే ఆధిపత్య ధోరణి. ఆస్తులు ఆర్పేసుకునైనా దాని కోసం పాకులాడతారు. జగన్ వాళ్లని సరిగ్గా అక్కడే దెబ్బ కొట్టాడు.

నెల్లూరు అంటే ఎప్పణ్నుంచో రెడ్ల ఆధిపత్యంలో ఉన్న జిల్లా. అన్ని పార్టీలలోనూ వాళ్లే నాయకులు. ఆ జిల్లా చాలక పక్కనున్న ప్రకాశం, దూరంగా ఉన్న వైజాగ్‌కి కూడా వెళ్లారు. అలాటిది వాళ్ల కంచుకోటలోనే అనిల్ కుమార్ యాదవ్‌ వంటి బిసిని మంత్రిని చేసి నెత్తిన కూర్చోబెడితే సహిస్తారా? టిక్కెట్ల పంపిణీకి వచ్చేసరికి నరసరావు పేట వంటి కమ్మ-రెడ్డి పోటాపోటీగా ఉండే నియోజకవర్గానికి అనిల్‌ను మారిస్తే అక్కడి వారు సహిస్తారా? పోనీ అనిల్ ఏమైనా సౌమ్యుడా? వారెంత, వీరెంత అని నోరు పారేసుకుని రెడ్లను తొక్కేశా అని విర్రవీగే మనిషి. వేమిరెడ్డి వంటి హితైషి, బలమైన నాయకుడు వైసిపి వీడడానికి కారణమయ్యాడు.

అలాగే గుంటూరు జిల్లాలో కమ్మ, రెడ్డి సమాన స్థాయిలో పోరాడే చోట రెడ్లను కాదని, ఎస్సీ ఐన మేకతోటి సుచరితను మంత్రిగా, అదీ హోం మంత్రిగా చేస్తే, ఎన్నికల వేళ మంగళగిరిలో రెండు సార్లు నెగ్గిన ఆళ్ల రామకృష్ణా రెడ్డిని పక్కన పెట్టి బిసికి టిక్కెట్టిస్తే రెడ్లు ఏమనుకుంటారు? ‘మేమంతా చేతకానివాళ్లమా?’ అనుకోరూ! అక్కడే కాదు, అనేక దశాబ్దాలుగా రెడ్లు పెత్తనం చలాయించే రాయలసీమలో సైతం రెడ్లను తోసిరాజని, మైనారిటీలకు, ఎస్సీలకు, బిసిలకు పదవులు కట్టబెట్టిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. (పదవులు పోవడమే కాదు, ఆర్థికంగా కూడా రెడ్లు నష్టపోయారన్న అంశం తర్వాతి వ్యాసాల్లో రాస్తాను) నరసరావుపేటలో ఉన్న కమ్మ ఎంపీని తీసేసి, అతని స్థానంలో వేరే సుదూర ప్రాంతం నుంచి బిసిని తీసుకురావడం, కమ్మల కంచుకోట అయిన హిందుపురంలో బాలకృష్ణతో ఢీకొనడానికి బిసి అభ్యర్థిని పెట్టడం కమ్మలను మండించదూ? క్షత్రియుల కంచుకోట ఐన నరసాపురంలో ఎంపీ అభ్యర్థిగా బిసిని పెడితే వాళ్లు భగ్గుమనరూ?

ఇలా ఆధిపత్య కులాలన్నిటినీ తొక్కేసి, బిసిలను ప్రమోట్ చేయడానికి కారణమేమిటి? పైన చెప్పినట్లు టిడిపి బలాన్ని క్షీణింప చేయాలంటే దానికి మద్దతుగా ఉన్న కమ్మలను తొక్కేయాలి, బిసిలను అక్కున చేర్చుకుని టిడిపికి దూరం చేయాలి అనే వ్యూహమే. గతంలో నేతలందరూ అణగారిన వర్గాలకు అండగా ఉంటామంటూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జపం జపించేవారు. వారిలో ఆర్థికంగా బలమైన వారు సంఖ్యాపరంగా తక్కువే. జగన్ వచ్చాక బిసి కూడా చేర్చాడు. బిసిలను ఎస్సీలతో కలిపి బ్రాకెట్ చేయడమే తప్పు. రిజర్వేషన్ల కోసం ‘మేం సామాజికంగా వెనకబడి ఉన్నాం’ అని బిసిలు క్లెయిమ్ చేస్తారు తప్ప, ఆర్థికపరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, పలుకుబడి పరంగా కానీ వాళ్లు ఎస్సీల కంటె ఎన్నో సోపానాల పైన ఉన్నారు. మానసికంగా కూడా వారిది అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ మెంటాలిటీయే తప్ప ఎస్సీ మెంటాలిటీ కాదు.

బిసిలను దువ్వడంలో జగన్‌కు మరో వ్యూహం కూడా ఉంది, తను తప్ప వైసిపిలో వేరే అగ్రకుల నాయకుణ్ని లేకుండా చేయడం! ఎవరైనా ఎక్కడైనా బలంగా ఉంటే, వారి స్థానంలోనో లేక వారి సమాన స్థాయిలోనో ఒక బిసిని పెట్టి వారి ప్రాధాన్యత తగ్గించడం, బలహీన పరచడం! ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారుచేస్తున్నా అంటూ ఎవరికీ పెద్దగా బలం లేకుండా చేసి, ‘తనొక్కడే రాజు తక్కిన వాళ్లందరూ బంటులే, తోసి పడేస్తే కిక్కురుమనకుండా పడిపోవాల్సిన వారే’ అనే సంకేతాన్ని యిచ్చాడు. ఇది యితనితో ప్రారంభం కాలేదు. ఇందిరా గాంధీ ఎప్పుడో చేసి చూపించింది. నెహ్రూ జమానాలో రాష్ట్రాల్లో బలమైన నాయకులుండేవారు. జాతీయ వ్యవహారాలు ఎలా ఉండాలో అందరూ కలిసి నిర్ణయించేవారు. నెహ్రూ అనంతరం ప్రధానిగా శాస్త్రిని, ఇందిరను ఎన్నుకోవడంలో వీరంతా భాగస్వాములే.

ఇందిర 1966లో ప్రధాని అయ్యాక యిది బాగా లేదనుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రుల ప్రాబల్యాన్ని తగ్గిస్తేనే జాతీయంగా తన స్థాయి పెరుగుతుంది, తన మాటకు ఎదురు చెప్పేవారు లేకుండా పోతారు అని లెక్క వేసింది. కానీ ఓపిక పట్టింది. 1970 డిసెంబరులో పాక్‌పై యుద్ధంలో గెలిచి వారి దేశాన్ని రెండుగా చీల్చిన ఘనతను దేశప్రజలందరూ ఇందిరకు కట్టబెట్టడంతో మూడు నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఇందిర ఘనవిజయం సాధించింది. ఇక తన ప్లానును 1971-72లలో అమలు చేసింది. లింగాయతుల పాలనలో ఉన్న కర్ణాటకలో దేవరాజ్ అర్సు వంటి బిసిని 1972 మార్చిలో ముఖ్యమంత్రిని చేసింది. శుక్లా కుటుంబ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో పిసి సేఠీని 1972 జనవరిలో చేసింది. రాజస్థాన్‌లో బర్కతుల్లా ఖాన్ అనే ముస్లిమును 1971 జులైలో చేసింది. బిహార్‌లో భోలా పాశ్వాన్ శాస్త్రి అనే ఎస్సీని 1971 జులైలో చేసింది. యుపిలో రాజపుట్‌ను తప్పించి కమలాపతి త్రిపాఠీని అనే బ్రాహ్మణుణ్ని 1971 ఏప్రిల్‌లో చేసింది. బెంగాల్‌లో తనకు ఆత్మీయుడైన సిద్ధార్థ శంకర్ రాయ్‌ను 1972 మార్చిలో చేసింది.

వీళ్లలో రాయ్, అర్సు మాత్రమే నిలదొక్కుకున్నారు. సేఠీ 3 ఏళ్లు మాత్రమే ఉన్నాడు. శుక్లా మళ్లీ వచ్చేశాడు. త్రిపాఠి, బర్కతుల్లా, పాశ్వాన్ అందరూ రెండేళ్లే ఉండగలిగారు. ఇక ఆంధ్ర విషయానికి వస్తే, కాబినెట్ మొత్తమంతా రెడ్లే కనబడుతున్నారని గమనించి, 1969 తెలంగాణ ఉద్యమాన్ని సాకుగా చూపి, బ్రహ్మానంద రెడ్డిని తీసేసి అతని స్థానంలో బ్రాహ్మణుడైన పివి నరసింహారావుని 1971 సెప్టెంబరులో ముఖ్యమంత్రిగా చేసింది. పివి భూసంస్కరణలు చేపట్టడంతో భూస్వామ్య వర్గాలైన కమ్మ, రెడ్డి ఏకమయ్యారు. జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభించి, పివిని దింపేదాకా ఊరుకోలేదు. తర్వాతి రోజుల్లో దేశప్రధానిగా ఎంతో పేరు తెచ్చుకున్న పివి 15 నెలలకే అసమర్థ ముఖ్యమంత్రి అనిపించుకుని గద్దె దిగాల్సి వచ్చింది.

11 నెలల రాష్ట్రపతి పాలన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినైనా ఎంచుకోవాల్సి వచ్చినపుడు రెడ్డిని కాకుండా, కమ్మవారి మద్దతున్న తెలంగాణ వెలమ ఐన జలగం వెంగళరావుని ఎంచుకుంది ఇందిర. ఎన్టీయార్ వచ్చాకనే కమ్మవారు ఆర్థికంగా, రాజకీయంగా బలపడ్డారని కొందరు వాదిస్తూంటారు. అది తప్పు. కమ్మలు ఆర్థికంగా ఎప్పణ్నుంచో బలపడుతూ వచ్చారు. ఇంకా బాగా ఎదగడానికి, కాంగ్రెసులో రాజకీయంగా బలపడడానికి వెంగళరావు సహాయపడ్డారు. జాతీయ స్థాయి నాయకుడి మాటకు ఎదురు లేకుండా చూడడానికై రాష్ట్రస్థాయిలో బలమైన వాళ్లని మార్చడం కాంగ్రెసు ఒక్కటే చేసింది అనుకోవడానికి లేదు. బిజెపి కూడా చేసింది, చేస్తోంది. మహారాష్ట్రలో ఫడణవీస్‌ను, హరియాణాలో నాన్-జాట్‌ను ముఖ్యమంత్రిగా చేయడం, యిటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎవరూ ఊహించినివారిని తేవడం… యిలాటివి చేస్తోంది.

రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, జిల్లా స్థాయి నాయకులతో యిలాటి ఆటలు ఆడతాడు. ప్రాంతీయ పార్టీల్లో తను, తన కుటుంబం తప్ప వేరే ఎవరినీ ఎదగకుండా చేస్తాడు. కరుణానిధిని స్టాలిన్ కోసం వైగోని, దేవెగౌడ కుమారస్వామి కోసం సిద్ధరామయ్యను తప్పించడం యిలాటిదే. టిడిపిలో బాబు తర్వాత ఎవరు? అంటే లోకేశే అని సమాధానం వచ్చేట్లా టిడిపి సీనియర్లు సైడ్‌లైన్ అయ్యారు కదా, వైసిపిలో జగన్ సైతం యివే ప్రయోగాలు చేశాడు. పదవిలో వచ్చిన ఐదేళ్లకు ఇందిర చేస్తే జగన్ రెండేళ్లకే మొదలు పెట్టాడు. బిసిల పేరుతో జిల్లా స్థాయిలో ఏ నాయకుడూ ఎదగకుండా చేశాడు. వేరే చోటి నుంచి తీసుకుని వచ్చి రుద్దాడు. నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్పడం విషయంపై తర్వాతి వ్యాసంలో రాస్తాను. దీనిలో ‘సోషల్ యింజనియరింగ్’ ఎలా చీదేసిందో మాత్రం రాస్తున్నాను. దీనికి జగన్ పెట్టిన పేరు సామాజిక న్యాయం. కానీ బిసిలకు యింత ప్రాధాన్యత యివ్వకూడదు అని ఎవరూ బహిరంగంగా అనలేదు. అంటే కులాహంకారిగా ముద్ర పడుతుందన్న భయం. నిజానికి చిరంజీవి పార్టీ పెట్టినపుడు తనపై కాపు ముద్ర పడకుండా ప్రజారాజ్యాన్ని బిసిల పార్టీగానే ప్రొజెక్టు చేశాడు. జ్యోతిబా ఫులేని తెలుగువారికి పరిచయం చేశాడు. బిసిలకే ఎక్కువగా టిక్కెట్లు యిచ్చాడు. అంతా శభాష్ అన్నారు కానీ ఓట్లేయలేదు. ఏకచక్రపురంలో ఉండగా తెచ్చిన అన్నంలో సగం కుంతి భీముడికే వడ్డిస్తే తక్కిన పాండవులు కిమ్మనలేదు, సోదరులు కాబట్టి. ఈనాటి సమాజంలో బిసిలకు సగం టిక్కెట్లిచ్చా అంటే హర్షించే జనం లేరు.

జగన్ బిసి హోరుతో కమ్మ, కాపు, రెడ్డి, ద్విజ వర్గాలన్నీ ఏకమయ్యాయి. వారిలో అధికాంశం వైసిపికి వ్యతిరేకంగా ఓటేశారు. జనాభాలో వారి శాతం బట్టి వారి ఓట్ల లెక్కలు వేయవద్దు. మేధోపరంగా కన్విన్స్ చేసో, కండబలం లేదా కాసుబలం చూపి ఒత్తిడి చేసో, వారు యితరుల చేత తాము చెప్పినవారికి ఓట్లు వేయించగల సామర్థ్యం కలవారు. టిడిపికి కాపుల మద్దతు లేకుండా చేయడానికి, ఎన్ని పదవులు యిచ్చినా, ఎన్ని పథకాలు అమలు చేసినా బిసిలపై జగన్ కురిపించిన ప్రేమ కారణంగా వారు వైసిపిని ఆదరించ లేదు. గోదావరి జిల్లాలలో కాపులకు, సెట్టిబలిజలకు పడదు. వైసిపి సెట్టిబలిజలకు ప్రాధాన్యత యివ్వడంతో కాపులు వేయలేదు. ఎస్సీలంటే కూడా కాపులకు పడదు. కోనసీమకు ఆంబేడ్కర్ జిల్లా పేరు పెట్టిన వివాదం దీనికి తోడైంది. సెట్టిబలిజలకు కూడా ఎస్సీలతో వైరమే. జిల్లా పేరు విషయంలో జరిగిన గొడవల్లో వారు కేసులు ఎదుర్కున్న కోపంతో వారూ వైసిపికి వేయలేదు. ఇలా జగన్ ఫెల్ బిట్వీన్ మెనీ స్టూల్స్. ఆసరాగా ముక్కాలి పీట కూడా మిగల్లేదు.

జగన్ కులపరంగానే కాక ఆర్థిక వర్గ పరంగా కూడా సమాజాన్ని వర్గీకరించాడు. బిసిలను ఒకే సమూహంగా చూడలేము. పైన చెప్పినట్లు స్థాయి పరంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందినవారు వారిలో ఎక్కువమంది ఉన్నారు. అందుకని ఎగువ వర్గాలతో కలిసి వైసిపికి వ్యతిరేకంగా ఓటేశారు. 2014-19 మధ్య కాపులను బిసిలలో చేర్చడం అంశంపై గందరగోళం చేసి అటు కాపులను, యిటు బిసిలను యిద్దర్నీ చంద్రబాబు దూరం చేసుకున్నాడు. ఈసారి జగన్‌కు అదే జరిగింది. కాపులకు పదవులు యిచ్చాడని బిసిలు, తమ స్థానాల్లో బిసిలకు టిక్కెట్లిచ్చాడని కాపులకు కోపాలు వచ్చి యిద్దరూ దూరమయ్యారు.

పదవులు పుచ్చుకున్న వారూ సంతోష పడలేదు. పదవి యిచ్చారు తప్ప అధికారం యివ్వలేదని వారు కోపగించుకున్నారు. కాపులు, బిసిలే కాదు, రెడ్లతో సహా ఏ కులానికి చెందినా సరే, అందరూ పేరుకి మాత్రమే సీట్లో ఉన్నారు కానీ స్వతంత్రంగా ఏమీ చేయగలిగినట్లు కనబడదు. అది యింకో విస్తృతాంశం. తర్వాత చెప్తా. ప్రస్తుతానికి గ్రహించవలసిన దేమిటంటే ఏ కులమూ ‘ఇది మన ప్రభుత్వం, దీన్ని నిలబెట్టాలి’ అనుకోలేదు. ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా వైసిపి ఓడిపోయింది చూడండి. ఇదీ కులపరమైన వైఫల్యం. ఇక జగన్ చేసిన మరో పెద్ద ప్రయోగం, సమాజాన్ని ఆర్థికవర్గాల పరంగా విడదీసి, తనకంటూ సాలిడ్ ఓటు బ్యాంకు నిర్మించుకోవాలని చూడడం. దాని పర్యవసానాలు వచ్చే వ్యాసంలో..!

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2024)



Source link

Leave a Comment