మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాకోర్టులో ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో ఆయన న్యాయ పోరాటం మొదలు పెట్టారు. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. చట్టసభల సంప్రదాయం ప్రకారం పది శాతం సీట్లు దక్కితేనే ప్రతిపక్ష హోదా లభిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష హోదా దక్కలేదు.
దీంతో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ తనదైన స్టైల్‌లో పోరాటం చేస్తున్నారు. పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఎక్కడా లేదని జగన్ వాదన. అసెంబ్లీ, పార్లమెంట్‌లలో ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పదిశాతం సీట్లు రాకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారో ఉదహరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జగన్ లేఖ రాశారు. అయినప్పటికీ అయ్యన్నపాత్రుడి నుంచి జగన్‌కు సానుకూల నిర్ణయం రాలేదు.
మరోవైపు అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా మాట్లాడుతూ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రశ్నే లేదన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ జగన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. స్పీకర్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. గత నెల 24న స్పీకర్‌కు లేఖ రాసినట్టు జగన్ తరపు న్యాయవాది తెలిపారు.
మరోవైపు ప్రభుత్వ తరపు న్యాయవాది అసలు జగన్ పిటిషన్‌కు విచారణ అర్హతే లేదని వాదించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు … అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు మూడు వారాలు సమయం ఇస్తూ విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.