దిశ,డెస్క్‌వెబ్ : ఎందరో మహనుభావుల ప్రాణ త్యాగ ఫలితంగా మనం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాము. దాని ఫలితంగా ఆగస్టు 15, 1947 న స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ఆ కారణంగా ఆగస్టు 15 దేశవ్యాప్తంగా జెండా ఎగుర వేస్తారు. డా. బీ.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యంగం 1950 జనవరి 26న దేశంలో అమలులోకి వచ్చింది. ఆ రోజున కూడా జాతీయ పతాకావిష్కరణ జరుగుతుంది. అయితే ఈ రెండు రోజులలో జరిగే పతాకావిష్కరణ ఒకే విధంగా ఉండవు. దానికి గల కారణాలు తెలుసుకుందాం..
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కట్టి పైకి లాగుతారు.జాతీయ జెండా ఎగరేయడం అనేది బ్రిటిష్ పాలన నుండి దేశం విముక్తి పొందడాన్ని సూచిస్తుంది. అందుకే దీనిని జెండా ఎగురవేయడం అంటారు.
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. గణతంత్ర దినోత్సం రోజున జెండాను మడతపెట్టి కర్ర పై భాగంలోనే కడతారు.రాష్ట్రపతి తాడు లాగగానే జెండా తెరుచుకుంటుంది. దాన్ని జెండా ఆవిష్కరణ అంటారు.రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని జెండా ఆవిష్కరణ సూచిస్తుంది.
మెుట్టమెుదటి సారిగా జరుపుకున్న స్వాతంత్య్ర దినోత్సవంలో జెండా ఎగరేసే బాధ్యతను నాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంటన్ అప్పగించారు. అయితే ఆయన బ్రిటిషర్ కావడంతో… జెండా ఎగరవేయడానికి ఆయన సరైన వ్యక్తి కాదని భావించారు. దీంతో ఆ బాధ్యతను ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వీకరించారు. అందుచేత స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండాని ప్రధాని ఎగురవేస్తారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దేశానికి తొలి రాష్ట్రపతి అయ్యాక.. తొలి రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.