పొత్తులు పెట్టుకుని జనసేన టీడీపీ నుంచి ఎన్ని సీట్లు తీసుకుంటుందో తెలియదు. ఆశావహులు మాత్రం జనసేనలో చాలా మంది కనిపిస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కార్పోరేటర్ అయిన ఒక డాక్టర్ గారు పాదాలు కదిపి నియోజకవర్గం మొత్తం కదం తొక్కుతున్నారు. పవనన్న ప్రజా బాట పేరుతో పాదయాత్ర చేపట్టారు. అది సెంచరీ కొట్టింది.
అడుగడుగునా జనాలు బ్రహ్మరధం పడుతున్నారని పాదయాత్రీకుడు అయిన జనసేన డాక్టర్ గారు అంటున్నారు. ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకున్నాను, ఇక పరిష్కరించడమే తరువాయి అని అంటున్నారు. పవనన్న ఆశీస్సులతో ప్రజల సమస్యలు తీరుస్తాను అని చెబుతున్నారు.
ఆయన తన మనసులో మాటను అలా చెప్పేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్ అయ్యారు. టీడీపీకి పెందుర్తి నుంచి ఒక నేతను తీసుకుని వచ్చి పార్టీని నడిపిస్తున్నారు.
ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా. దాంతో ఆయనకు టికెట్ ఖాయం అని అంటున్నారు. ఇపుడు జనసేన టికెట్ రేసులోకి దూసుకుని వస్తోంది. పొత్తులు అంటే రెండు పార్టీల ఆశలను చూసి సరిసమానంగా సంతృప్తి పరచడం అని అర్ధాలు చెప్పుకుంటున్నారు. ఈసారి జనసేన దక్షిణ నుంచి పోటీ చేస్తుంది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
జనసేనకు దక్షిణ కావాలి. విశాఖ జిల్లాలో ఉన్న పదిహేను అసెంబ్లీ సీట్లో కొన్ని సీట్లు జనసేనకు కచ్చితంగా ఇస్తారని అంటున్నారు అందులో దక్షిణం ఉంటే జనసేనకు దక్షిణ దక్కినట్లే అంటున్నారు. లేకపొతే టీడీపీకి ఎంత వరకూ సహకారం అందుతుందో కూడా చూడాలని అంటున్నారు.