రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. రాజకీయం అనేది భార్యాభర్తల్ని కూడా విడదీస్తుంది. రక్తసంబంధాల్లో చిచ్చు రేపుతుంది. అలాంటిది మిత్రపక్షాల మధ్య గొడవలు రాకుండా వుంటాయా? కళ్లెదుటే జనసేన రాజకీయంగా బలపడుతోంటే.. టీడీపీకి మండుతోంది. ఇటీవల జనసేన చేపట్టిన సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వచ్చింది. జనసేన ప్రస్థానాన్ని ముఖ్యంగా టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగాలనే పవన్‌కల్యాణ్ తపనపై టీడీపీ గుర్రుగా వుంది. తాజాగా విశాఖలో కార్పొరేషన్‌ను సొంతం చేసుకోవాలని జనసేన వ్యూహాత్మక పావులు కదుపుతోంది. ఇటీవల ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మరికొందర్ని కూడా చేర్చుకుని మేయర్ పదవిని హస్తగతం చేసుకోడానికి జనసేన చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ ఆగ్రహంగా వుంది.
అందుకే జనసేన ఎదుగుదలపై టీడీపీ అనుకూల మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రాజకీయంగా తాము ఎదగాలే తప్ప, జనసేన పని కాదనేది టీడీపీ నాయకుల భావన. జనసేన బలపడితే రేపు ఎప్పుడైనా ఏకు మేకవుతుందని టీడీపీలో ఒక రకమైన భయం. పవన్ ఆలోచన కూడా అదే అనే అభిప్రాయం వుంది. ప్రస్తుతం అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసుకుంటే, వచ్చే ఎన్నికల్లో రెట్టింపు స్థానాల్లో పోటీ చేయాలనేది పవన్ ఎత్తుగడ.
ఇదే జరిగితే తమ గతేం కావాలని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎంత కాలమైనా తమ నీడలో జనసేన ఉండాలని, స్వతంత్ర ఆలోచనలు ఉండకూదని టీడీపీ అభిప్రాయం. అందుకు విరుద్ధంగా జనసేనాని అడుగులు వేస్తుండడమే టీడీపీ ఆగ్రహానికి కారణమని చెప్పక తప్పదు.