పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. ఆమె ఏదైనా మాట్లాడినా, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో రేణూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
కొడుకు అకీరా, కూతురు ఆద్య అంటే రేణూకి ఎంతో ప్రేమ. వారికి సంబంధించిన విషయాలను, ఫొటోలను, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఇటీవల మెగా ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా జరగగా.. అకీరా, ఆద్య ఆ సంబరాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అన్నాచెల్లెళ్లు కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రేణూ.. ఆ ఫొటోలకు పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’ చిత్రంలోని “అన్నయ్య అన్నావంటే ఎదురవనా” అనే పాటని జోడించింది.
ఇక అకీరా, ఆద్యతో కలిసి తాను దిగిన పలు ఫొటోలను షేర్ చేసిన రేణూ.. “కొన్నిసార్లు.. అకీరా, ఆద్యలకు నేను జీవితాన్ని ఇచ్చానా? లేక నాకు జన్మించి వారే నాకు జీవితాన్ని ఇచ్చారా? అని నేను ఆశ్చర్యపోతుంటాను” అంటూ రాసుకొచ్చింది. ఇలా వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్న రేణూ.. తాజాగా మాత్రం ఒక పోస్ట్ తో సరదాసరదాగానే గట్టి వార్నింగ్ ఇచ్చేసింది.
ఆద్య బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణూ.. “ఈరోజు నుంచి నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే.. నా పర్సనల్ సెక్యూరిటీతో డీల్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త” అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.