ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబునాయుడు అంతటితో సంతృప్తి చెందడం లేదు. ఇప్పుడాయన జనం నుంచి జాలి కోరుకుంటున్నారు. అధికారం చేపట్టి 45 రోజులైంది. పింఛన్ల పెంపు మినహాయిస్తే, చాలా హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబుపై వుంది. ముందు అధికారంలోకి వస్తే, ఆ తర్వాత హామీల్ని అమలు చేయడమా? లేదా? అనేది ఆలోచించవచ్చని చంద్రబాబు వ్యూహాత్మంగా వ్యవహరించారు.
బాబు అనుకున్నట్టే అధికారం దక్కింది. విపరీతమైన హామీల్ని నెరవేర్చే మార్గం ఆయనకు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అందుకే ఆయన పూర్తిస్థాయి బడ్జెట్‌ను కూడా ప్రవేశ పెట్టలేకపోతున్నారు. బహుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఇంతటి దుర్గతి పట్టి వుండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు ప్రసంగిస్తూ… జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ ఏలుబడిలో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తిస్థాయి బడ్జెట్ కూడా పెట్టుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. మరో రెండు నెలల తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామని ఆయన చెప్పుకొచ్చారు. పదేపదే శ్వేత పత్రాల గురించి బాబు మాట్లాడం వెనుక వ్యూహం లేకపోలేదు. రాష్ట్రాన్ని జగన్ దివాలా తీశారని, దీంతో రాష్ట్ర ఖజానాలో ఏమీ లేదని చెప్పడం ద్వారా, అయ్యో పాపం బాబు అని జనం అనాలని ఆయన కోరుకుంటున్నారు.
హామీల్ని నెరవేర్చాలని చంద్రబాబు దృఢ సంకల్పంతో ఉన్నారని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే, ఆయన మాత్రం ఏం చేస్తారని జనం జాలి చూపాలనేది చంద్రబాబు ఎత్తుగడ. ఈ విషయంలో బాబుది అత్యాశే. ఎందుకంటే జగన్ సంక్షేమ పాలన పుణ్యాన ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిందని నిత్యం విమర్శించిన సంగతి బాబు మరిచినట్టున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సరే, జగన్‌కంటే ఎక్కువగా ప్రజలకు సంక్షేమ లబ్ధి కలిగిస్తానని బాబు బడాయికి పోయారు.
ఇప్పుడు తనను అర్థం చేసుకోవాలని, సంక్షేమ పథకాలు ఇవ్వలేనని చెప్పడానికి సర్కస్ ఫీట్లు వేస్తున్నారు. మాట ఇచ్చి, మోసగించారనే అభిప్రాయం జనంలో కలిగితే, రియాక్షన్ ఎలా వుంటుందో బాబుకు తెలియంది కాదు. కానీ ఐదేళ్ల పాటు అధికారాన్ని మాత్రం చెలాయించే అవకాశాన్ని దక్కించుకున్నారు. దాన్ని నిలబెట్టుకోవడం అతి పెద్ద సవాల్‌గా మారడమే కూటమిని ఇబ్బంది పెడుతోంది.