AP CMO : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటుతున్నా ఇంకా అధికారులు గాడిలో పడలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు నిదర్శనం ప్రభుత్వ అనుమతి లేకుండానే జీపీఎస్ జీవో జారీ, గెజిట్ నోటిఫికేషన్ విడుదల అని భావిస్తున్నారు. ఈ విషయంపై సీఎంవో సీరియస్ గా ఉందని, ప్రభుత్వ అనుమతి లేకుండా జీవో, గెజిట్ ఎందుకు జారీ చేశారని సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ ఉదంతంపై సీఎంవో అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఆర్థికశాఖ, న్యాయ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఎవరు కారణమో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి, న్యాయశాఖ సెక్షన్ అధికారి హరిప్రసాద్ రెడ్డి పాత్రపై సీఎంవో విచారణ చేస్తుంది. ఈ ఇద్దరు అధికారుల గత వ్యవహారాలపై ఆరా తీస్తుంది. ప్రభుత్వం మారినప్పుడు నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని బిజినెస్ నిబంధనలు చెబుతున్నా… హడావుడిగా జీపీఎస్ జీవో జారీ, గెజిట్ నోటిఫికేషన్ జారీపై నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. సీంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున జీపీఎస్ జీవో జారీ అవ్వడం, సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ విడుదల వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత ప్రభుత్వ నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని బిజినెస్ రూల్స్ చెబుతున్నాయి. కానీ కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు సీఎంవో అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో పాటు పలు శాఖల్లో, మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులున్నారా? అనే కోణంలో సీఎంవో ఆరా తీస్తుంది.