ఇండస్ట్రీలో సక్సెస్ రేటు 10శాతం కూడా ఉండదు. కొన్నిసార్లు నెల మొత్తం డ్రై అవుతుంది. కనీసం యావరేజ్ హిట్ కూడా పడదు. ఈ ఏడాది జులై బాక్సాఫీస్ కూడా అలానే తయారైంది. రిలీజైనవే తక్కువ సినిమాలు. అందులో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు.
జులై మొదటి వారం ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. జూన్ చివరి వారంలో కల్కి సినిమా రిలీజైంది. హిట్ టాక్ వచ్చింది. దీంతో జులై మొదటివారంలో మరో సినిమాను విడుదల చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు.
రెండో వారంలో భారతీయుడు-2 రిలీజైంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. శంకర్ సినిమాల స్థాయిలో లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. 1996లో భారతీయుడు వచ్చింది. 2024లో భారతీయుడు-2 వచ్చినప్పటికీ, శంకర్ మాత్రం 1996లోనే ఉండిపోయాడు.
రిజల్ట్ చూసి, సినిమాను కాస్త ట్రిమ్ చేశారు. అయినప్పటికీ భారతీయుడు 2 కోలుకోలేకపోయాడు. అలా ఓ మంచి ఫ్రాంచైజీని అంతా కలిసి మిస్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాతో పాటు అదే వారం వచ్చిన సారంగదరియా అనే సినిమా కూడా పోయింది.
మూడో వారం మరో ఫ్లాప్ వచ్చింది. దాని పేరు డార్లింగ్. ప్రియదర్శి, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హను-మాన్ ప్రొడ్యూసర్ తెరకెక్కించడంతో క్రేజ్ వచ్చింది. ప్రమోషన్ కూడా గట్టిగా చేశారు. హీరోయిన్ కు మల్టిపుల్ పర్సనాలటీ డిజార్డర్ పెట్టి తీసిన ఈ సినిమా బెడిసికొట్టింది. సినిమా అంతా అస్తవ్యస్తంగా, అయోమయంగా అనిపించింది.
ఈ సినిమాతో పాటు ది బర్త్ డే బాయ్, క్రైమ్ రీల్, పేకమేడలు లాంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా వచ్చాయి. ఇవన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. పేకమేడలు సినిమా కంటెంట్ తో ఆకట్టుకున్నప్పటికీ, చిన్న సినిమాలకు థియేటర్లలో చోటులేదనే విమర్శ ఈ సినిమాతో మరోసారి నిజమైంది.
చివరి వారంలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు రెండు రిలీజయ్యాయి. వీటిలో ఒకటి ధనుష్ 50వ చిత్రం రాయన్ కాగా.. రెండోది రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు. ఈ రెండూ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. రాయన్ సినిమా తమిళ్ లో హిట్టయినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. సెకండాఫ్ ఫెయిల్ అవ్వడం ఈ సినిమాకు పెద్ద మైనస్.
ఇక పురుషోత్తముడు సినిమా భారీ ప్యాడింగ్ తో వచ్చినప్పటికీ కొత్తదనం లేక నిలబడలేకపోయింది. ఈ సినిమాలతో పాటు వచ్చిన ఆపరేషన్ రావణ్, గల్లీ గ్యాంగ్ స్టార్స్ లాంటి సినిమాలేవీ ఆడలేదు.
ఓవరాల్ గా జులై నెలలో ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. జూన్ నెల చివర్లో రిలీజైన కల్కి సినిమా వల్ల జులై బాక్సాఫీస్ కాస్త మెరిసింది.