కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక ఎన్ఎం (Niharika NM) గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా విశెస్ అందిస్తూ టాలీవుడ్ లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ.
చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. థియేటర్ ఆర్ట్స్ మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న నిహారిక తన పదో తరగతిలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. వివిధ అంశాలపై తన అభిప్రాయాలు తెలిపేలా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రమంగా సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్, కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ఇటీవల యూట్యూబ్ ఆధ్వర్యంలో జరిగిన క్రియేటర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో ఇండియా నుంచి వరుసగా రెండోసారి రిప్రజెంట్ చేసింది. కొన్ని ముఖ్యమైన సామాజికాంశాలపై అవేర్ నెస్ తెచ్చేలా నిహారిక కంటెంట్ క్రియేట్ చేస్తోంది. తను చదువుకున్న యూఎస్ కాలిఫోర్నియా చామ్ మాన్ యూనివర్సిటీలో నిహారిక ఎన్ఎం కెరీర్ లో ఎదిగిన విధానంపై కేస్ స్టడీ చేస్తుండటం విశేషం. టాలీవుడ్ లో కూడా నిహారిక అదే స్థాయిలో సత్తా చాటుతుందేమో చూడాలి.