TSPSC : ఇటీవలే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నియామకమైంది. తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఛైర్మన్ గా, అలాగే సభ్యులుగా అనిత రాజేంద్ర ఐఏఎస్, పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, ఏరపతి రామ్మోహన్ రావులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే టీఎస్పీఎస్సీ సభ్యుడిగా ఉన్న రామ్మోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యక్తి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఉద్యోగుల విభజన సందర్భంగా తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్న 214 మందిలో రామ్మోహన్ రావు ఒకరు. అయితే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించి తెలంగాణలో పోస్టింగ్ ఇవ్వలేదు. రామ్మోహన్ రావు ఇటీవలే పోస్టింగ్ తీసుకొని టీఎస్‌జెన్‌కోలో ఈడీగా కొనసాగుతున్నారు. ఏప్రిల్ లో పదవీ విరమణ కావాల్సిన రామ్మోహన్ రావును టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల భర్తీ ప్రక్రియలో సర్వీస్ కమిషన్ కీలకపాత్ర పోషిస్తుంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అవకాశం కల్పిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Source link