దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ చైర్మన్ అంటే ఎంతో కీలకమైన పదవిగా అంతా భావిస్తారు. ఆ పోస్ట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు. ఈ పదవిలో కూర్చోవాలని తహతహలాడుతారు.
అటువంటి ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి కేంద్ర మాజీ మంత్రి విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు అయిన అశోక్ గజపతిరాజుకు దక్కనుందని ప్రచారం సాగుతోంది. ఆయన ఇటీవల ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని జిల్లాలో గెలిపించారు.
ఆయన ఉత్తరాంధ్రల సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన సింహాచలానికి వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్రలోని అనేక ఆలయాలకు ఆయన ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలు నిండుగా ఉన్న అశోక్ కి ఈ పవిత్రమైన బాధ్యతలు అప్పగిస్తే గౌరవంతో పాటు టీటీడీ చైర్మన్ హుందాతనం కూడా మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారుట.
అశోక్ కి గవర్నర్ పదవి ఇస్తారని ప్రచారం సాగినా ఆయనకు ఈ పదవినే ఇస్తారని అంటున్నారు. ఆయన వంటి వారిని ఎంపిక చేస్తే పోటీలో ఉన్న వారు అంతా తగ్గడమే కాకుండా సబబు అయిన నియామకం అని భావిస్తారు అని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారుట.
అన్నీ అనుకూలంగా సాగితే త్వరలోనే అశోక్ ని ఈ కీలక పదవిలో నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుందని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పూర్తి దృష్టి పెట్టిన కొత్త ప్రభుత్వం అశోక్ వంటి అనుభవశాలికి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆస్తిక జనుల మన్ననలు అందుకోవడానికి చూస్తోంది.
గవర్నర్ పదవి విషయంలో మరో సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు పేరుని సీరియస్ గా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. కేంద్ర మంత్రితో పాటు ఏపీలో అనేక పదవులు నిర్వహించిన అశోక్ రాజకీయాలు చాలు అనుకుంటున్నారు. దాంతో ఆయనకు ఈ ఆధ్యాత్మిక బాధ్యతలు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని వినవస్తోంది.
The post టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు? appeared first on Great Andhra.