టీడీపీ పేప‌ర్ పులికి సుజనా చెక్‌! Great Andhra


సులువుగా ప్ర‌చారం పొందడం ఎలా పొందాలో కొంత మంది నాయ‌కుల‌కు బాగా తెలుసు. అలాంటి వారిలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ఒక‌రు. చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ గుడ్ లుక్స్‌లో ప‌డేందుకు బుద్ధా వెంక‌న్న నిత్యం ఏదో ఒక ప్ర‌చార కార్య‌క్ర‌మం చేస్తూనే వుంటారు. ఎన్నిక‌ల‌కు ముందు బుద్ధా పొలిటిక‌ల్ జిమ్మిక్కులు ఓ రేంజ్‌లో సాగాయి.

ఏకంగా ర‌క్తంతో చంద్ర‌బాబు పేరు రాసి నానా హ‌డావుడి చేశారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ టికెట్ కోసం ర్యాలీ పేరుతో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌నకు దిగారు. నాటి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితో పాటు వైసీపీ నాయ‌కుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. కోటి విద్య‌లూ కూటి కోస‌మే అన్న చందంగా… బుద్ధా వెంక‌న్న ఎన్ని చేసినా టీడీపీ పెద్ద‌ల అనుగ్ర‌హం కోస‌మే అని అంద‌రికీ తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆర్థికంగా భారీ ల‌బ్ధి పొందొచ్చ‌నే ఆశ అడియాస కావ‌డం గ‌మ‌నార్హం. త‌న ప‌నులేవీ కావ‌డం లేద‌ని, తానే ఒక‌రిపై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న వాపోయారు. అస‌లు విష‌యం ఏమంటే… విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో బుద్ధా ఆట‌లేవీ సాగ‌డం లేదు అనేదాని కంటేబీజేపీ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి వ్యూహాత్మ‌కంగా క‌ట్ట‌డి చేశార‌ని టాక్ వినిపిస్తోంది.

దుర్గ‌మ్మ గుడికి సంబంధించి టోల్‌గేట్‌, పార్కింగ్ విష‌యాల్లో బుద్ధా జోక్యాన్ని సుజ‌నా చౌద‌రి ఒప్పుకోలేదు. బుద్ధా చెప్పిన‌వి ఏవీ చేయ‌కూడ‌ద‌ని సుజ‌నా అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే సీఐ, ఎస్ఐల బ‌దిలీల్లోనూ బుద్ధా సిఫార్సు చేసిన‌వేవీ జ‌ర‌గలేదు. ప్ర‌భుత్వ అధికారులెవ‌రూ బుద్ధా చెప్పిన వాటిని చేయ‌డానికి నిరాక‌రిస్తున్నారు. దీంతో అధికారంలోకి వ‌చ్చినా త‌న ప‌నులేవీ సాగ‌క‌పోవ‌డంతో ఆయ‌న మ‌న‌స్తాపం చెందారు.

టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మీడియా ముందుకొచ్చి రెచ్చిపోయేవారు. ఆయ‌న‌కు టీడీపీ అనుకూల మీడియా విప‌రీతంగా ప్రాధాన్యం ఇచ్చేది. దీంతో బుద్ధా అధికారంలోకి వ‌స్తే ఏవేవో జ‌రిగిపోతాయ‌ని ఆశించారు. తీరా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందులు కావ‌డంతో ల‌బోదిబోమంటున్నారు. పేప‌ర్ పులికి సుజ‌నా చౌద‌రి చెక్ పెట్టార‌ని టీడీపీలోని ఒక వ‌ర్గం అంటోంది. బహుశా అధికారం అంటే ఏంటో వెంక‌న్న‌కు ఇప్పుడు జ్ఞానోద‌యం అయ్యి వుంటుందేమో!



Source link

Leave a Comment