కేవలం సినిమాలకే పరిమితం అవ్వాలనుకోవట్లేదు హీరోలు. కుదిరితే బుల్లితెరపై, అవకాశం వస్తే ఓటీటీలో కూడా కొత్త పాత్రలు పోషించడానికి సై అంటున్నారు. బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్ల నుంచి విశ్వక్ సేన్ వరకు చాలామంది ఈ దిశగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి తను కూడా చేరతానంటున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ హీరో, తనకు కూడా టీవీ-ఓటీటీపై ఆసక్తి ఉన్నట్టు వెల్లడించాడు. అవకాశం వస్తే కపిల్ షో లాంటి మంచి హ్యూమరస్ ప్రొగ్రామ్ చేయాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు.
మంచి స్పాంటేనిటీ ఉన్న హీరో నవీన్ పొలిశెట్టి. సినిమాల్లో ప్రతి సన్నివేశాన్ని తనదైన శైలిలో ఇంప్రొవైజ్ చేసి నటిస్తుంటాడు. నిజానికి అలాంటి స్వేచ్ఛ ఉంటేనే సినిమాలు చేస్తానని కూడా చెబుతుంటాడు ఈ హీరో. ఇలాంటి లక్షణాలున్న నటుడు కచ్చితంగా ఓటీటీ, టీవీ షోలకు సెట్ అవుతాడు. మరీ ముఖ్యంగా కామిక్ టైమింగ్ నవీన్ కు అదనపు బలం.
అయితే తన మనసులో కామెడీ ప్రొగ్రామ్ లాంటి ఆలోచనలున్నప్పటికీ.. ప్రస్తుతానికి తనకు టైమ్ లేదంటున్నాడు ఈ హీరో. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత ఏకంగా 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ హీరో. వచ్చే ఏడాది ఈ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా సెట్స్ పైకి వస్తాయని, అప్పుడు ఆ సినిమాల వివరాలు చెబుతానంటున్నాడు.