ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 20కిలోమీటర్లు ప్రయాణించాలంటే పీక్ టైమ్‌లో ఈజీగా గంటన్నర టైమ్ పడుతున్నది. ఇలా ఎంతోసేపు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నవాళ్ల అందరిచూపు సిగ్నళ్లపైనే ఉంటుంది. రెడ్ లైట్ పోయి గ్రీన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. మరి ట్రాఫిక్ సిగ్నళ్లు రెడ్, యెల్లో, గ్రీన్ కలర్స్‌లోనే ఎందుకు ఉండాలి. ఇంకే కలర్స్‌లో ఎందుకు ఉండవు? అనే ఆలోచన వచ్చిందా? ఒకవేళ రాకపోయినా? ఇప్పుడు అవును కదా? అనుకుంటున్నారా? ఆ సంగతులు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దూరం నుంచి కూడా కనిపించడం..
ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఈ రంగులు మిగితా రంగుల కంటే దూరంలో ఉన్నవాళ్లకు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. పొగమంచు, రాత్రి, పగలు సమయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రంగులను ఎంపిక చేశారు.
కలర్ బ్లైండ్నెస్ ఉన్నా..
ఈ మూడు రంగులు కలర్ బ్లైండ్నెస్ (వర్ణ అంధత్వం) ఉన్నవారికి కూడా కనిపిస్తాయి. అందువల్ల ఈ మూడు రంగుల ఎంపికకు ఇది కూడా ఒక కారణం. దూరం నుంచి కనిపించడంతోపాటు వర్ణ అంధత్వం ఉన్న వ్యక్తులు కూడా చూసే అవకాశం ఉండటం వల్ల ఈ రంగులు ఎంపిక అయ్యాయి.
మానసిక స్థితిపై ప్రభావం
మానవ మానసిక స్థితి కూడా ఎరుపు రంగు ప్రమాదానికి గుర్తుగా భావిస్తుంది. అదేసమయంలో ఆకుపచ్చ ప్రకృతికి ప్రతిరూపంగా.. పసుపు సంతోషానికి, సూర్యుడికి ప్రతీకగా భావించడం కూడా ఈ రంగుల ఎంపికకు ఒక కారణమైంది.
ఎక్కడ మొదలైంది?
లండన్‌లో 1868 ఏడాదికి కాస్త అటుఇటుగా ట్రాఫిక్ సిగ్నళ్లను ప్రారంభించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగు లాంతర్లను ఉపయోగించి.. ట్రాఫిక్ క్రమబద్దీకరించేవారు. కూడళ్ల వద్ద పోలీస్ కానిస్టేబుల్ రెడ్, గ్రీన్ రంగు అద్దాలు ఉన్న లాంతర్లను చేతితో పట్టుకునేవాడు. అయితే, ఒకటీ రెండేళ్లకు ఒక లాంతర్ పేలడం వల్ల పోలీసుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పుడే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. 1920లో విలియం పాట్స్ అనే పోలీసు అధికారి రెడ్, గ్రీన్‌తోపాటు యెల్లో కలర్ కూడా ఉండాలని సూత్రీకరించాడు. రెడ్ కలర్ పడితే వాహనాలు ఆగాలని.. గ్రీన్ అంటే వాహనాలు ముందుకు కదలాలని.. యెల్లో లైట్ ఉంటే ఎదురుగా ఎలాంటి వాహనాలు లేవనే నమ్మకం కలిగితే ముందుకు కదలాలని నిర్ణయించాడు. దీనికి పౌరవ్యవస్థలతోపాటు ప్రభుత్వాల ఆమోదం లభించింది. ఈ మూడు లైట్ల వ్యవస్థను అమెరికాలోని డెట్రాయిట్, మిచిగాన్‌లో ముందుగా ప్రారంభించారు. అదే సమయంలో 1920లో ఆఫ్రికా మూలాలు ఉన్న అమెరిక పౌరుడు గారెట్ మోర్గాన్ ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్ వ్యవస్థను ఆవిష్కరించాడు. దీనికి పేటెంట్ కూడా పొందాడు. ఆ వెంటనే దీనిని రైల్వేలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ లైట్ వ్యవస్థకు ఆద్యుడు మోర్గానే.