మంచు మోహన్ బాబు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ.. ఆయన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమధ్య, “హెరిటేజ్ సంస్థ మోహన్ బాబుది అయితే.. చంద్రబాబు మోసం చేసి లాక్కున్నారు” అని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. ఆ సమయంలో స్పందించిన మోహన్ బాబు.. తన పేరుతో రాజకీయం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పరోక్షంగా పోసానిని హెచ్చరించారు. ఇక తాజాగా మరోసారి రాజకీయాల్లో మోహన్ బాబు పేరు తెరపైకి వచ్చింది.
మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంచు ఫ్యామిలీతో పాటు మోహన్ లాల్, ముకేశ్ రిషి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. “ఆలోచించి ఓటు వేయండి. ఒక్కోసారి తప్పు చేస్తుంటాం. ఒక పార్టీ మంచిది అనుకొని ఓటేస్తే.. వాళ్ళు తప్పు చేస్తారు. దాంతో ఈసారి మరో పార్టీకి ఓటేస్తాం. ఇలా ఎవరిని నమ్మాలో తెలియదు. అందుకే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించుకొని ఓటేయాలి. ప్రాంతీయ పార్టీల గురించి నేను మాట్లాడదలచుకోలేదు. కానీ భారత ప్రధానిగా మళ్ళీ మోడీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. ఆయన ఆలోచన విధానం బాగుంటుంది. ఆయన లాంటి వ్యక్తి ఈ దేశానికి కావాలి. మీరు కూడా ఓటేసేముందు ఆలోచించండి. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. డబ్బులు ఏ పార్టీ వారు ఇచ్చినా తీసుకోండి.. ఎందుకంటే అది ప్రజల సొమ్మే. కానీ ఓటు మాత్రం మనసుకి నచ్చినవారికి వేసి, భారత దేశ భవిష్యత్ కి సహకరించండి” అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడను అంటూనే.. మోడీని ప్రశంసించి పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఓటెయ్యాలో మోహన్ బాబు చెప్పినట్లయింది. ఎందుకంటే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీకి ఓటేయమని చెప్పడమంటే.. పరోక్షంగా టీడీపీ-జనసేన కూటమికి మద్దతు తెలపడమే అవుతుంది. ఆ లెక్కన చూస్తే.. ఇవి ఏపీ అధికార పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలుగా కూడా అర్థం చేసుకోవచ్చు.
గత ఎన్నికల్లో మోహన్ బాబు వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలాంటి మోహన్ బాబు.. వైసీపీ మద్దతుదారుడైన పోసానికి ఆమధ్య పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు వైసీపీ ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీతో దోస్తీ చేస్తున్న బీజేపీకి ఓటు వేయమనడం సంచలనంగా మారింది. మొత్తానికి కొంతకాలంగా ఆయన మాటలు గమనిస్తే వైసీపీకి దూరంగా ఉంటున్నారని అర్థమవుతోంది.