నటుడిగా అవకాశాలు రాక ఎందరో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. అవకాశాలు వచ్చి సెలబ్రిటీగా ఎదిగిన కొందరు మాత్రం.. ఎప్పుడెప్పుడు ఆ పేరు పోగొట్టుకుందామా అన్నట్టుగా ప్రవరిస్తున్నారు. తాజాగా ఫేమస్ యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.
షణ్ముఖ్ జస్వంత్, అతని సోదరుడు వినయ్ సంపత్ ని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ ని, ఒక అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డాక్టర్ మౌనిక అనే యువతిని మోసం చేసి.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్. ఈ విషయమై మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు అతడిని ప్రశ్నించేందుకు ఫ్లాట్ కు వెళ్లారు. అదే సమయంలో షణ్ముఖ్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియోలు తీయోద్దంటూ వాదించాడు. కాగా, పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేసి.. వేర్వేరు కేసులు నమోదు చేశారు.
ఐతే షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యి.. విడుదలయ్యాడు. డ్రగ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్న విషయం తెలిసిందే. దీంతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన షణ్ముఖ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ ఐన యూట్యూబర్ షణ్ముఖ్.. పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెబ్ సిరీస్ ల నుంచి సినిమాలకు ఎదిగే క్రమంలో.. ఇలా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో.. ఎందుకిలా సెలబ్రిటీలు చేతులారా తమ కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.