ఢిల్లీలో ధర్నా విజయవంతం కావడంపై వైసీపీ ఖుషీ అవుతోంది. ధర్నాకు ఇతర పార్టీల నేతలు వస్తారో, లేదో అనే ఆందోళన వైసీపీ నేతల్లో ఉండింది. అయితే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌యాదవ్ ధర్నాకు వెళ్లడం, మళ్లీ జగన్ సీఎం కావచ్చని కామెంట్స్ చేయడం వైసీపీలో జోష్ నింపింది.
అధికారం కోల్పోవడంతో పాటు దారుణ ఓటమిపాలైన నేపథ్యంలో వైసీపీ భవిష్యత్‌పై ఆందోళన నెలకుంది. అసలు జగన్ కోలుకోడానికి చాలా సమయం పడుతుందని వైసీపీ నాయకులు, కార్యకర్తలే అనుకున్నారు. కానీ చాలా త్వరగా జగన్ కోలుకోడానికి టీడీపీ ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దారుణ ఓటమితో కుంటిపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు టీడీపీ తెగబడడం ఆ పార్టీ చేసిన మొదటి తప్పు.
దాడుల్ని తిప్పి కొట్టేందుకు జగన్‌తో సహా ఆ పార్టీ నాయకులు రోడ్డుపైకి రావాల్సిన అనివార్య పరిస్థితిని చేజేతులా టీడీపీ కల్పించింది. ఈ నేపథ్యంలో జగన్ వ్యూహాత్మకంగా ఢిల్లీలో ధర్నా తలపెట్టాలని నిర్ణయించారు. ఈ పరిణామాన్ని టీడీపీ అంచనా వేయలేకపోయింది. దేశ రాజధానిలో ధర్నా చేపట్టి, ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు పెను విఘాతం కలుగుతోందన్న సందేశాన్ని జగన్ పంపగలిగారు.
జగన్ ధర్నాకు ఎస్పీ, ఆప్, అన్నాడీఎంకే, టీఎంసీ, ఉద్దవ్ శివసేన, ఐయూఎమ్ఎల్ తదితర పార్టీలు హాజరై సంఘీభావం తెలపడం సరికొత్త రాజకీయ పరిణామం. టీడీపీ చేష్టలతో జాతీయ స్థాయిలో బీజేపీకి రాజకీయంగా నష్టం వాటిల్లే పరిస్థితి.