సినిమా పేరు: తంత్ర
నటీనటులు: అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుషాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల తదితరులు
మ్యూజిక్: ఆర్ ఆర్ ధృవన్
డీఓపీ: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల
ఆర్ట్ డైరెక్టర్: గురు మురళీ కృష్ణ
ఎడిటర్: ఎస్.బి. ఉద్ధవ్
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ గోపిశెట్టి
నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య
బ్యానర్స్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ: మార్చి 15, 2024
భాషతో సంబంధం లేకుండా హారర్ సినిమాల పట్ల ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మధ్య కాలంలో తెలుగులోనూ పలు హారర్ సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొంది విజయం సాధించాయి. ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘తంత్ర’. ‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న నటి అనన్య నాగళ్ళ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను భయపెట్టి విజయాన్ని సాధించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రేఖ(అనన్య నాగళ్ళ) భయస్తురాలు. దానికి తోడు ఆమెకు ఆత్మలు(దెయ్యాలు) కనిపిస్తుంటాయి. చిన్నప్పటి నుంచి తన స్నేహితుడు తేజు(ధనుష్ రఘుముద్రి)ని ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ క్షుద్ర పూజలు చేసింది ఎవరు? వారు రేఖనే ఎందుకు టార్గెట్ చేశారు? విగతి(టెంపర్ వంశీ), రాజేశ్వరి(సలోని) ఎవరు? వాళ్లకి, రేఖకి సంబంధం ఏంటి? రేఖను కాపాడటం కోసం తేజు ఏం చేశాడు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
“పిల్ల బచ్చాలు మా సినిమాకు రావొద్దు” అంటూ విడుదలకు ముందు ‘తంత్ర’ టీం వినూత్నంగా ప్రచారం చేసింది. అది చూసి ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉంటాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. మామూలు కథని తీసుకొని కూడా అదిరిపోయే హారర్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెప్పించవచ్చు. కానీ దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాత్రం మంచి కథని తీసుకొని కూడా.. దానిని తెర మీదకు తీసుకొచ్చే క్రమంలో తడబడ్డాడు. కథలో హారర్ ఎలిమెంట్స్ కి ఎంతో స్కోప్ ఉన్నా.. భయపెట్టడంలో సక్సెస్ కాలేకపోయాడు. సాధారణంగా హారర్ సినిమాలు మొదలవ్వడమే ఒక హారర్ సీన్ తో మొదలవుతాయి. ఆ తర్వాత పాత్రలను పరిచయం చేస్తూ కథలోకి వెళ్తాయి. కానీ ‘తంత్ర’ విషయంలో అలా జరగలేదు. సినిమా ఫ్లాట్ గా స్టార్ట్ అవుతుంది.
తంత్ర సినిమా కథని దర్శకుడు ఆరు అధ్యాయాలుగా చెప్పాడు. అయితే దాని వల్ల సినిమాకి జరిగిన ప్రయోజనం ఏమీ లేదు. అలా ఆరు భాగాలుగా చెప్పేకంటే.. నేరుగా కథ చెప్తేనే మరింత ఎఫెక్టివ్ గా ఉండేది అనిపించింది. హారర్ థ్రిల్లర్ సినిమాలంటే.. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాలు ఉండాలి. అలాగే థ్రిల్ ఫీలయ్యే ఊహించని ట్విస్ట్ లు ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు లాజిక్ లు వదిలేసి, బోర్ ఫీలవ్వకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ చిత్ర దర్శకుడు ప్రేక్షకులను భయపెట్టడం కంటే, తాంత్రిక శక్తుల గురించి తనకు తెలిసిన విషయాలు అన్నింటినీ చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా కోసం ఆయన తాంత్రిక శక్తుల గురించి ఎంతో రీసెర్చ్ చేశాడని అర్థమవుతుంది. కానీ ప్రేక్షకులు క్షుద్ర పూజల గురించి తెలుసుకోవడానికో లేక నేర్చుకోవడానికో థియేటర్ కి రారు. వాటి వల్ల కలిగే భయాన్ని, థ్రిల్ ని ఎంజాయ్ చేయడానికి వస్తారు. అయితే డైరెక్టర్ ఆ విషయాన్ని మరిచి.. హారర్ ఎలిమెంట్స్ తో భయపెట్టే కంటే, తాంత్రిక శక్తుల గురించి లెస్సన్స్ చెప్పడానికే ఎక్కువ ప్రయత్నించాడు. దాంతో కథనం నెమ్మదిగా సాగుతూ.. చాలా చోట్ల ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. పతాక సన్నివేశాలు మాత్రం మెప్పించాయి.
ఆర్ ఆర్ ధృవన్ సంగీతం బాగానే ఉంది. సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల కెమెరా పనితనం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు పరవాలేదు.
నటీనటుల పనితీరు:
రేఖ పాత్రలో అనన్య నాగళ్ళ ఉన్నంతలో మెప్పించింది. పతాక సన్నివేశాల్లో తప్ప ఆమెకు నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. ధనుష్ రఘుముద్రి స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ బాగున్నాయి. రాజేశ్వరిగా సలోని సర్ ప్రైజ్ చేసిందని చెప్పవచ్చు. టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుషాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.
ఫైనల్ గా..
పులిహోరలో పులి ఉండటం ఎంత నిజమో.. హారర్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తంత్ర’లో భయపెట్టే సన్నివేశాలు ఉండటం అంతే నిజం. క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. దర్శకుడు హారర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను భయపెట్టడం కంటే.. క్షుద్ర పూజల గురించి తెలియజేసే ప్రయత్నమే ఎక్కువ చేశాడు. దాంతో హారర్ తగ్గింది.. ల్యాగ్ పెరిగింది. మొత్తానికి సినిమా అంతగా మెప్పించలేకపోయింది.
రేటింగ్: 2/5