సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ ఇచ్చారు ఫిలింఛాంబర్ పెద్దలు. స్వయంగా దిల్ రాజు మీడియా ముందుకొచ్చి ఈ ప్రకటన చేశారు. అయినప్పటికీ ఫిబ్రవరి 9న ఈగల్ కు చిన్నపాటి పోటీ తప్పేలా లేదు.
ఓవైపు రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ తో పాటు, మరోవైపు సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమా ఆ రోజున థియేటర్లలోకి వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ అంశంపై హీరో సందీప్ కిషన్ స్పందించాడు.
ఫిబ్రవరి 9వ తేదీ తమకు చాలా ఇంపార్టెంట్ అని, ఆరోజున కచ్చితంగా సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతూనే.. ఫిలింఛాంబర్ పెద్దలెవ్వరూ తమను ఇంతవరకు సంప్రదించలేదంటూ చెప్పుకొచ్చాడు.
"నిజానికి మేం సంక్రాంతికి రావాలనుకున్నాం. దెయ్యాలు, మేజిక్కులు ఉన్న సినిమా కావడంతో పిల్లలకు ఇది నచ్చుతుంది. కాకపోతే ఇన్ని సినిమాల మధ్య వద్దనుకున్నాం. ఫిబ్రవరి 9కి డీజే టిల్లూ ఉందని తెలిసి, వాళ్లకు ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని మరీ మేం డేట్ వేశాం. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో డేట్ మార్చే అవకాశం కూడా మాకు లేదు. పైగా అప్పట్లో జరిగిన ప్రెస్ మీట్ లో మా గురించి ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే మాకు ఎవ్వరూ ఎలాంటి కాల్స్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే అప్పుడు చర్చిస్తాం. మాకైతే ఫిబ్రవరి 9 చాలా ఇంపార్టెంట్. మేం వస్తున్నాం."
ఓవైపు ఇంత జరుగుతున్నప్పటికీ తమను ఎవ్వరూ సంప్రదించలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదనే బాధ సందీప్ కిషన్ మాటల్లో వ్యక్తమైంది. అంతేకాదు.. నిర్మాత అనీల్ సుంకరతో చర్చించి, ఆయన అనుమతితోనే తను ఈ మాటలు చెబుతున్నానని కూడా కన్ ఫర్మ్ చేశాడు సందీప్ కిషన్.
చూస్తుంటే, ఇటు హీరో, అటు నిర్మాత ఇద్దరూ బాగా హర్ట్ అయినట్టున్నారు. సందీప్ కిషన్ చెప్పినదాన్ని బట్టి చూస్తే, వాళ్లు హర్ట్ అవ్వడంలో తప్పు లేదనిపిస్తోంది.