నేను ఏ తప్పు చేయలేదు, నేను భయపడే రకం కాదు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లాగా వాయిదాలు కోరను, సిఐడి విచారణలు చాలా ధైర్యంగా ఎదుర్కొంటాను.. ఇలాంటి ప్రగల్భాలను తలపించే మాటలన్నీ చెప్పినది ఎవరో తెలుసా? సాక్షాత్తు నారా లోకేష్ బాబు!.
తండ్రిని అరెస్టు చేసిన తర్వాత పారిపోయి ఢిల్లీలో కూర్చున్న నారా లోకేష్ కు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వ్యవహారంలో 41ఏ నోటీసులు అందించిన తర్వాత లోకేష్ ఒక రేంజి లో రెచ్చిపోయారు. విచారణ గురించి అవాకులు చవాకులు పేలారు. విచారణను ఎదుర్కొంటానని వాయిదాలు కోరనని తాను ఒక పెద్ద హీరోలాగా ఆయన సెలవిచ్చారు. తీరా ఇప్పుడు ఏమైంది? బుధవారం సిఐడి విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉండగా వాయిదాలు కావాలంటూ కోర్టును దేబిరించారు?.
తనకు హెరిటేజ్ సంస్థ నుంచి రికార్డులు, తీర్మానాలు అందడం అంత తొందరగా జరగదని కాబట్టి దయచేసి వాయిదా ఇవ్వాలని లోకేష్ కోరడం ఆశ్చర్యకరంగా ఉంది. హెరిటేజ్ కు మంత్రి అయ్యే ముందువరకు సర్వాధికారి యజమానిగా రికార్డుల ప్రకారం ఉన్నటు వంటి లోకేష్.. ఆ సంస్థ నుంచి రికార్డులు తెప్పించుకోవడం కష్టం అని అనడం చోద్యమే. సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలపై నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వాదనలను విన్న తర్వాత.. ధర్మాసనం లోకేష్ అక్టోబరు 10న సీఐడీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
లోకేష్ ఎంత భయంతో సతమతం అవుతున్నారంటే.. ఫైబర్ నెట్ కేసులో తనను అరెస్టు చేస్తారనే భయం ఉన్నదని, అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన మరో పిటిషన్ ద్వారా కోర్టును అభ్యర్థించారు. అయితే, ఫైబర్ నెట్ కేసులో లోకేష్ ను నిందితుడిగా చేర్చనే లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేయడం గమనార్హం. దీంతో, ‘గుమ్మడికాయల దొంగ’ అని అనకముందే లోకేష్ భుజాలు తడుముకుంటున్నట్టుగా అయింది. ఒకవేళ ఆయన పేరు చేర్చాల్సి వస్తే.. ముందే 41ఏ నోటీసులు ఇస్తామని ప్రభుత్వం తరఫున చెప్పడంతో లోకేష్ విజ్ఞప్తి మేరకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండానే కోర్టు విచారణ ముగించింది.
మొత్తానికి నేను విచారణ వాయిదాలు కోరను.. నేను హీరోని అని సొంత డబ్బా కొట్టుకుని .. తీరా సమయం వచ్చేసరికి లోకేష్ బేలగా కోర్టును ఆశ్రయించి వాయిదా తీసుకోవడం చూసి జనం నవ్వుకుంటున్నారు.