దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేలా చర్యలు
శ్రీవారి దర్శనంతో పాటు వసతి సేవల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఆఫ్‌లైన్ (కౌంటర్ సేవలు) మరియు ఆన్‌లైన్ (వెబ్ పోర్టల్) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ గుర్తించింది. గత ఏడాది కాలంగా ఆన్‌లైన్ లో (రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవాలు, వర్చువల్ సేవలు మొదలైనవి) మరియు ఆఫ్‌లైన్ లో (ఎస్ ఎస్ డి టోకెన్లు, వసతి) తదితర సేవల బుకింగ్‌లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది. ఇందులో ఓకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలో తేలింది. భక్తులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందిస్తున్న సేవలలో పారదర్శకతను మరింతగా పెంచేందుకు సిద్ధమైంది. ఈ సేవలను మరింత మెరుగుపరిచి ఆఫ్‌లైన్‌లో మరియు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందే దళారులు మరియు మధ్యవర్తులపై చర్యలు చేపట్టింది.