Entertainment

తెలుగు ప్రేక్షకులకు దక్కిన గొప్ప వరం.. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం!


పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా… పోతావ్‌రా రేయ్‌… నాశనమై పోతావ్‌, నీ యంకమ్మా, పండగ చేసుకో, రకరకాలుగా ఉంది మాస్టారూ, జఫ్ఫా,  ఇరుకుపాలెం వాళ్లంటే ఏకసెక్కాలుగా ఉందా?, నా పెర్ఫార్మెన్స్‌ మీకు నచ్చినట్టయితే ఎస్సెమ్మెస్‌ చేయండి,  ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా.. నెల్లూరు పెద్దారెడ్డిగారి మేనల్లుడ్ని, నన్ను ఇన్‌వాల్వ్‌ చేయకండి రావుగారు, ఖాన్‌తో గేమ్స్‌ ఆడకు… శాల్తీలు లేచిపోతాయి, నెల్లూరు పెద్దారెడ్డెవరో తెలీకుండానే డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ చేస్తున్నారయ్యా మీరు, మేమెక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం.. మీరిక్కడే ఉంటారు.. అక్కడికి రారు, ముసలోడే కానీ మహానుభావుడు, ఈ డైలాగులు ఎవరివి అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అంటే అంత పాపులర్‌ అయిన డైలాగులివి. 

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నా, బ్రహ్మానందం శైలి విభిన్నం. తన ఎక్స్‌ప్రెషన్స్‌, కామెడీ టైమింగ్‌, డైలాగ్‌ చెప్పే విధానం, బాడీ లాంగ్వేజ్‌ ఇవన్నీ ఆయన సొంతం. స్క్రీన్‌ మీద బ్రహ్మానందం కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులు పూస్తాయి. పేరులోనే నవ్వుని చేర్చుకున్న బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన ఓ వజ్రంలాంటి వాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం.. అని జంధ్యాల పదే పదే చెప్పేవారు. ఆ మాటలకు కట్టుబడి ఆయన సినిమాల్లో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కొన్ని పూర్తి హాస్యభరిత చిత్రాలను కూడా రూపొందించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. 

తెలుగువారు బ్రహ్మానందం హాస్యానికి ఎంతగా అలవాటు పడ్డారంటే.. నిత్య జీవితంలో వారికి ఎదురయ్యే ఎన్నో సందర్భాల్లో బ్రహ్మానందం వాడిన కొన్ని ఊత పదాలను, డైలాగులను వాడుతుంటారు. అంతేకాదు, టీవీల్లో బ్రహ్మానందం కనిపించని రోజు ఉండదు. అలా కనిపించని రోజు కనుచూపు మేరలో ఉండే అవకాశం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన నటించిన వాటిలో కొన్ని ముఖ్యమైన సినిమాల గురించి ప్రస్తావించే అవకాశం లేదు. ఎందుకంటే లెక్కకు మించి సినిమాల్లో నటించిన బ్రహ్మానందంకి ఏ సినిమాకి ఆ సినిమాయే ప్రత్యేకం అని చెప్పాలి. గురువు జంధ్యాల చెప్పిన బాటలోనే నడుస్తూ 35 సంవత్సరాలుగా తెలుగు వారి ఇంట నవ్వులు పూయిస్తున్న బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి 1. బహ్మానందం జీవితంలోని కొన్ని విశేషాలు, ఆయన ప్రతిభకు దక్కిన అవార్డులు, అందిన ప్రశంసలు.. వంటి వాటి గురించి తెలుసుకుందాం. 

బ్రహ్మానందం జీవితంలోని కొన్ని విశేషాలు..

ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం ముప్పాళ్ళ గ్రామంలో జన్మించారు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి, తల్లి కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. తను పుట్టగానే తల్లికి గుర్రపువాతం రావడంతో అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు బ్రహ్మానందం. అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. సత్తెనపల్లి శరభయ్య ఉన్నత పాఠశాలలో హైస్కూలు విద్యను అభ్యసించారు. భీమవరం డి.ఎన్‌.ఆర్‌. కాలేజీలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ పూర్తి చేసారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసిన తర్వాత సినీరంగ ప్రవేశం చేశారు. తండ్రి కూడా కళాకారుడే. రంగస్థల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం మొదట మేకప్‌ వేసుకుంది శ్రీతాతావతారం చిత్రానికే అయినా, మొదట రిలీజ్‌ అయింది మాత్రం అహనా పెళ్ళంట. ఆయన సినీ రంగానికి పరిచయం కావడానికి చిరంజీవి, జంధ్యాల ముఖ్య కారకులు. నటుడిగా ఉన్నత స్థాయిని చేరుకున్నప్పటికీ తోటి నటీనటుల పట్ల గౌరవం, అభిమానాన్ని చూపించే బ్రహ్మానందం అంటే ఇష్టపడనివారు ఉండరు. ‘జీవితంలో మంచి పేరు తెచ్చుకోకపోయినా ఫర్వాలేదు.. చెడ్డపేరు మాత్రం తెచ్చుకోకు. సిగరెట్‌, మందు జోలికి వెళ్ళకు’ అంటూ చిన్నతనంలో తన తల్లి చెప్పిన మాటను శిరసావహిస్తూ.. జీవితంలో ఆ వ్యసనాల జోలికి వెళ్ళలేదు బ్రహ్మానందం. 

బ్రహ్మానందం అందుకున్న అవార్డులు, పొందిన సత్కారాలు

1250కి పైగా సినిమాల్లో నటించి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు చేసిన నటుడిగా బ్రహ్మానందం 2010లో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 2009లో  బ్రహ్మానందంకు పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. బ్రహ్మానందం కెరీర్‌లో ఆరు నంది అవార్డులు, ఒక ఫిల్మ్‌ ఫేర్‌, మూడు సైమా అవార్డులు వరించాయి. ‘అహ నా పెళ్లంట’ సినిమాలోని అరగుండు పాత్ర ద్వారా తొలి నంది అవార్డును అందుకున్నారు. ఐదు కళాసాగర్‌ పురస్కారాలు, తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు, పది సినీగోయర్స్‌ పురస్కారాలు, ఎనిమిది భరతముని పురస్కారాలు, రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం, ఆటా (అమెరికా), సింగపూర్‌, మలేషియా, లండన్‌ డాకర్స్‌, అరబ్‌ ఎమిరేట్స్‌, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్‌ వారి సత్కారాలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటును అందుకున్నారు బ్రహ్మానందం.. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మానందం పొందిన బిరుదులు, సత్కారాలు, అవార్డులకు కొదవేలేదు. 

ప్రపంచంలోనే ఎక్కువమంది కమెడియన్లు ఉన్న ఇండస్ట్రీ టాలీవుడ్‌. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగింది. తెలుగు వారు హాస్యప్రియలు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఒకప్పుడు బ్రహ్మానందం సినిమా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్త కమెడియన్లు చాలా మంది వచ్చారు. వారికీ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో బ్రహ్మానందం కాస్త పక్కకు తప్పుకున్నారు. చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో హాస్యానికి కొత్త అర్థం చెప్పిన బ్రహ్మానందం ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తోంది తెలుగువన్‌.



Source link

Related posts

ఎన్టీఆర్ బాటలోనే ప్రభాస్.. ‘కల్కి 2898 AD’ వాయిదా!

Oknews

ప్రశాంత్ నీల్ అభిమాన దర్శకుడు తెలుగు నటుడు కూడా 

Oknews

రాజమౌళి వల్లే ఇదంతా.. 'అహో విక్రమార్క' టీజర్ లాంచ్ ‌ఈవెంట్‌లో దేవ్ గిల్!

Oknews

Leave a Comment